దేవాదాయశాఖ అనధికారిక మంత్రిగా పెత్తనం చెలాయించే స్వరూపానంద .. తన నమ్మిన బంటు అయిన జ్వాలాపురం శ్రీకాంత్ అనే వ్యక్తిని దేవాదాయశాఖ సలహాదారుగా నియమించింది. ప్రభుత్వానికికూడా ఈ నియామకం ఇష్టం లేదేమో కానీ చాలా కాలం పెండింగ్లో పెట్టి చివరికి నియామకం చేసింది. అసలు దేవాదాయశాఖకు సలహాదారు ఏమిటన్న విస్మయం చాలా మంది వ్యక్తం చేశారు. కొంత మంది కోర్టులకూ వెళ్లారు. అయితే ప్రభుత్వం ఈ విషయంలో వాదనలు ఆసక్తికరంగా వినిపించలేదు. సమర్థించలేదు. దీంతో హైకోర్టు సలహాదారులపై కీలక వ్యాఖ్యలు చేసింది. జ్వాలాపురం శ్రీకాంత్ నియామకంపై స్టే విధించింది.
మంత్రులకు సలహాదారులంటే సరే కానీ.. శాఖలకు సలహాదారులేమిటని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో చాలా మంది సలహాదారులు ఇప్పుడు మొహాలు చూసుకోవాల్సిన పరిస్థితి. ఏపీ ప్రభుత్వం మంత్రులకు కాకుండా నేరుగా ప్రభుత్వ శాఖలకే సలహాదారులను నియమిస్తోంది. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా.. జగన్కు సలహాదారు కాదు.. ఏకంగా ప్రభుత్వం మొత్తానికి సలహాదారు అన్నట్లుగా ఉన్నారు. ఇప్పుడు హైకోర్టు వ్యాఖ్యలు ఆ సలహాదారులందరిలోనూ అలజడి రేపడం ఖాయంగా కనిపిస్తోంది.
శ్రీకాంత్ నియామకంపై స్టే ఇవ్వకపోతే ..రేపు అడ్వకేట్ జనరల్ కు కూడా సలహాదారును నియమిస్తారని న్యాయస్థానం సెటైర్లు వేసింది. సలహాదారులను నియమించుకోవటానికి అధికారుల కొరత ఉందా? అంటూ ఏపీ ప్రభుత్వానికి ప్రశ్నించింది కోర్టు. సలహాదారులు సలహాదారులుగా ఉండకుండా రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారు అంటూ ఏపీ ప్రభుత్వానికి న్యాయస్థానం మొట్టికాయలు వేసింది. అయితే ఇలాంటి అక్షింతలు ఏపీ ప్రభుత్వానికి లెక్క లేనన్ని పడ్డాయి.కాబట్టి.. పట్టించుకోదు.