ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఉన్న జువారీ సిమెంట్ పరిశ్రమను మూసివేయించిన ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తర్వులను కొట్టి వేస్తూ.. హైకోర్టు తీర్పు చెప్పింది. కాలుష్య నియమ నిబంధనలు పాటించడం లేదంటూ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్… జువారి సిమెంట్ పరిశ్రమ మూసివేతకు ఆదేశాలు ఇచ్చింది. కరెంట్ సరఫరాను నిలిపివేయాలని సూచించడంతో… ఆ పరిశ్రమకు కరెంట్ సరఫరా నిలిపివేశారు. అయితే ఆ సంస్థ తాము అన్ని రకాల పొల్యూషన్ నిబంధనలు పాటిస్తున్నామని కేంద్ర పర్యావరణ శాఖకు లేఖరాసింది. ఏపీ సర్కార్ ఉత్తర్వులపై న్యాయపోరాటం చేసింది. జువారి సంస్థ వేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు… పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టి వేసి… ఏపీపీసీబీఇచ్చిన మార్గదర్శకాలను ముప్పయ్యో తేదీలోపు అమలు చేయాలని ఆదేశించింది.
హైకోర్టు ఉత్తర్వులతో జువారి సిమెంట్ కర్మాగారంలో ఉపాధి పొందుతున్న దాదాపుగారెండు వేల మంది ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. జువారి సిమెంట్ మూత వెనుక కాలుష్యం కాదని అంతకు మించిన కారణాలు ఉన్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో… ప్రపంచంలోనే ప్రముఖ బ్రాండ్ అయిన అమెరూన్ బ్యాటరీల ఉత్పత్తి సంస్థ అయిన అమరరాజా ఫ్యాక్టరీలను కూడా పొల్యూషన్ కారణాలు చూపించి.. మూసివేతకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ కారణంగా పదహారు వేల మంది ఫ్యాక్టరీల్లో పని చేసే ఉద్యోగులు, కార్మికులకు సంస్థ సెలవు ప్రకటించింది. అమరరాజా కూడా న్యాయపోరాటం చేసే ఆలోచనలో ఉంది.
పారిశ్రామిక వర్గాల్లో ఏపీ ప్రభుత్వ చర్యలు టెర్రరు పుట్టిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీకి పరిశ్రమల రాకఅనేదే లేకపోగా… గతంలో పరిశ్రమలు పెడతారు అంటూ.. పెద్ద పెద్ద ప్రకటనలు చేసి.. భూములు కేటాయిస్తున్నట్లుగా చెబుతున్న వారు కూడా ఇంత వరకూ పరిశ్రమలు పెట్టడానికి రాలేదు. అలా ఒక్క పరిశ్రమ రాకపోగా… రాజకీయ ప్రత్యర్థుల పరిశ్రమల్ని మాత్రం.. చాలా జోరుగా టార్గెట్ చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వారందరికి న్యాయస్థానాలే అండగా ఉంటున్నాయి.