మార్గదర్శి సంస్థలపై పగబట్టినట్లుగా చేస్తున్న దాడులను ఆపేయాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎటువంటి దాడులు చేయవద్దని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. మార్గదర్శి సంస్థలపై పలు ప్రభుత్వ శాఖలు నాలుగు రోజుల పాటు సోదాలు నిర్వహించాయి. ఖాతాదారులను, ఏజెంట్లను బెదిరించి మరీ తప్పుడు ఫిర్యాదులు తీసుకుంటున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో మార్గదర్శి పై వివిధ ప్రభుత్వ శాఖల దాడులు చేయడాన్ని యాజమాన్యం హైకోర్టులో సవాల్ చేసింది.
ఈ పిటిషన్ ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా.. మార్గదర్శి తరపున సీనియర్ న్యాయవాదులు నాగముత్తు, మీనాక్షి అరోరా వాదనలు వినిపించారు. వాదనల అనంతరం మధ్యంతర ఉత్తర్వుల కోసం హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఉత్తర్వులు ఇచ్చే వరకు మార్గదర్శి సంస్థలపై ఎటువంటి దాడులు చేయవద్దని ప్రభుత్వ న్యాయవాదులకు హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. గత నాలుగు రోజులుగా రేయింబవళ్లు సోదాలు చేశారు. నిజానికి మార్గదర్శి ఆఫీసుల్లోని డస్ట్ బిన్ లో ఉన్న కాగితంతో సహా… గతంలోనే సోదాలు చేశారు. కానీ మళ్లీ మళ్లీ తప్పుడు కేసులు పెట్టడానికి ఈ సారి మరికొన్ని శాఖలతో కలిసి సోదాలు చేశారు. చిట్ ఖాతాదారులు కాని.. వారితో ఫిర్యాదులు చేయించుకుని ముగ్గురు ఉద్యోగుల్ని అరెస్ట్ చేశారు.
గతంలో ఓ డిఫాల్ట్ కస్టమర్ పేరుతో ఫిర్యాదు తీసుకుని.. ఏకంగా పోలీస్ కమిషనరే ప్రెస్ మీట్ పెట్టి..అభాసు పాలయ్యరు. కొద్ది రోజులుగా మార్గదర్శిపై పిచ్చిపట్టినట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రభుత్వం చెప్పినట్లుగా చేసే అధికారుల్ని అడ్డం పెట్టుకుని నిబంధనలు ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా దాడులు చేస్తోంది. మార్గదర్శిని మూసేస్తామని హెచ్చరించి.. దాని కోసం చేయాల్సినవన్నీ చేస్తోంది. ఇప్పుడు హైకోర్టు ఆదేశంతో ఇక దాడులు.. ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది.