మార్గదర్శి ఆఫీసుల్లో సీఐడీ సోదాలు చేయడానికి వీలు లేదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. సీఐడీతో పాటు ఇతర శాఖల అధికారులు తనిఖీలు చేయకూడదని స్పష్టం చేసంది. చిట్స్ రిజిస్ట్రార్ తనిఖీలు చేయాల్సి వస్తే 46-ఎ నిబంధన అనుసరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కల్పించవద్దని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది చందాదారులకు ఫోన్ చేసి వేధింపులు, బెదిరింపులకు పాల్పడకూడదని హైకోర్టు తెలిపింది. మార్గదర్శి చిట్ ఫండ్స్‌లో వివిధ ప్రభుత్వ శాఖలు తాజాగా తనిఖీలు చేయడాన్ని మార్గదర్శి యాజమాన్యం హైకోర్టులో సవాల్ చేసింది.
ఏపీ ప్రభుత్వం మొత్తం 37 శాఖల్లో ప్రస్తుతం చేస్తున్న తనిఖీలను సవాల్ చేస్తూ మార్గదర్శి కోర్టులో పిటిషన్ వేసింది. మార్గదర్శి తనిఖీల్లో సీఐడీ, స్టాంపులు, నిబంధనలు తదితర అధికారులు పాల్గొంటున్నారు. తనిఖీల పేరుతో మార్గదర్శి ఉద్యోగులకు విధుల నిర్వహణలో అధికారులు అడ్డంకులు కల్పిస్తున్నారని మార్గదర్శి తరపు న్యాయవాదులు వాదనల సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్ మరియు అసిస్టెంట్ రిజిస్ట్రార్ మాత్రమే శాఖలను తనిఖీ చేయడానికి , రికార్డులను ధృవీకరించడానికి అధికారం కలిగి ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
హైకోర్టు ఆదేశాలతో ఇక సీఐడీ మార్గదర్శి కేసులో జోక్యం చేసుకునే అవకాశం ఉండదని భావిస్తున్నారు. ఇప్పటి వరకూ సీఐడీనే ఈ కేసులో యాక్టివ్ గా ఉంటోంది. ఖాతాదారులతో ఫిర్యాదులు చేయించాలని తామే ప్రోత్సహిస్తున్నామని సీఐడీ చీఫ్ సంజయ్ గత ఆదివారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో చెప్పారు. ఈ ఉత్తర్వులతో ఇక సీఐడీ మార్గదర్శి జోలికి వెళ్లే అవకాశం లేకుండా పోయిందని భావిస్తున్నారు.