ధూళిపాళ్ల నరేంద్ర బెయిల్‌ను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన ఏసీబీకి షాక్ తగిలింది. బెయిల్ రద్దు చేయగల కారణాలు లేవని హైకోర్టు పిటిషన్‌ను కొట్టి వేసింది. బెయిల్ వచ్చిన తర్వాత విజయవాడలో సంగండెయిరీ డైరక్టర్ల సమావేశం పెట్టడాన్ని బెయిల్ షరతుల ఉల్లంఘనగా ఏసీబీ పేర్కొన్నది. ఆ సమావేశంపై కరోనా నిబంధనల ఉల్లంఘన కేసును విజయవాడ పోలీసులు … బెియల్ రద్దు పిటిషన్‌పై వేయడానికి ముందుగానే పెట్టారు. దీన్నే చూపించి.. బెయిల్ రద్దు చేయాలని హైకోర్టుకు వెళ్లారు. కానీ హైకోర్టు మాత్రం..అలా అనుకోలేదు.
పిటిషన్‌ను కొట్టి వేసింది. ధూళిపాళ్ల నరేంద్రకు బెయిల్ ఇచ్చిన తర్వాత.. ఆయన నెల రోజుల పాటు విజయవాడలోనే ఉండాలని కోర్టు ఆదేశించింది. అదే సమయంలో సంగం డెయిరీని స్వాధీనం చేసుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. చైర్మన్ నేతృత్వంలోని డైరక్టర్లే సంస్థను నడుపుకోవచ్చని స్పష్టం చేసింది. ఆ మేరకు ధూళిపాళ్ల విజయవాడలోనే ఉండి.. ఓ హోటల్లో సమావేశం నిర్వహించారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఎలాగైనా ధూళిపాళ్లను మళ్లీ జైలుకు పంపిచాలనుకున్న ఏపీ సర్కార్.. బెయిల్ రద్దు పిటిషన్ వేసింది. కానీ ప్రయోజనం లేకపోయింది. సంగం డెయిరీ విషయంలో ఏసీబీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. మళ్లీ మళ్లీ సోదాలు చేస్తామంటూ దాఖలు చేసిన పిటిషన్లను కూడా కోర్టులు కొట్టి వేస్తున్నాయి. అయినా ఏసీబీ మాత్రం.. వివిధ రకాలుగా తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉంది.