వైసీపీ పెంచి పోషించిన మొదటి రకం సోషల్ మీడియా సైకోల్లో ఒకరు అయిన బోరుగడ్డ అనిల్ కు బెయిల్‌ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇలాంటి వారిని క్షమించకూడదని స్పష్టం చేసింది. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన రిమాండ్ లో ఉన్నారు. తాను అమాయకుడ్నని తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారంటూ ఆయన బెయిల్ పిటిషన్ దాఖలుచేశారు. విచారణ జరిపిన హైకోర్టు ఆయన .. సోషల్ మీడియా రికార్డు చూసి క్షమించకూడదని నిర్ణయానికి వచ్చింది.
బోరుగడ్డ అనిల్ తాను జగన్ మనిషినని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా దూషణలకు పాల్పడేవాడు, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను చిటికెలో చంపేస్తానని అనేవాడు. వారి ఇంట్లో ఆడవాళ్లపై ఎలా మాట్లాడేవాడో చెప్పాల్సిన పనిలేదు. ఇవన్నీ వైసీపీ పెద్దలకు ఎంతో కర్ణపేయంగా ఉండేవి. అందుకే ఆసరాగా తీసుకుని ఎన్నో దందాలకు పాల్పడ్డాడు. ప్రభుత్వం మారిపోయిన తర్వాత పారిపోయాడు కానీ.. ఓ రోజు రహస్యంగా వచ్చి ఇంట్లో ఉండటంతో కనిపెట్టి అరెస్టు చేశారు. అప్పట్నుంచి జైల్లో ఉన్నాడు.
అతనికి పోలీసులు రాచ మర్యాదలు కూడా చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో చాలా మంది పోలీసులు సస్పెన్షన్ కు గురయ్యారు. రాజమండ్రి దగ్గర ఓ హోటల్ లో బిర్యానీలు పెట్టించడం, గుంటూరులోని ఓ పోలీస్ స్టేషన్ లో దిండ్లు, దుప్పట్లు ఇవ్వడం, ఎవరితో పడితే వారిని రప్పించి మాట్లాడించడం వంటివి చేశారు. బోరుగడ్డ దగ్గర డబ్బులను పోలీసులు తీసుకున్నట్లుగా గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో అసలు బోరుగడ్డ ఎవరో తమకు తెలియదన్నట్లుగా వైసీపీ నటిస్తూండటంతో హైలెట్ గా మారింది.