పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ నిర్ణయంపై స్టే ఇవ్వడం కుదరదని హైకోర్టు తేల్చిచెప్పేసింది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని.. ఎస్ఈసీ భావిస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టడం సాధ్యం కాదని.. ఎస్ఈసీని నిలువరించాలంటూ.. ఏపీ ప్రభుత్వం తరపున పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు..స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. విచారణ రేపు కూడా కొనసాగనుంది.
స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయమే ఫైనల్ అని గతంలో సుప్రీంకోర్టుకూడా స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియలో సామాన్యంగా కోర్టులు కూడా జోక్యం చేసుకోవు. ఈ విషయం సాధారణ న్యాయ విషయాల్లో అవగాహన ఉన్న వారందరికీ తెలుసు. అయినప్పటికీ ప్రభుత్వం మొండి పట్టుదలగా.. ఎస్ఈసీని నియంత్రించాలన్న ఉద్దేశంతో పంచాయతీ ఎన్నికలు సాధ్యం కాదని హైకోర్టులో చెప్పించాలని తాపత్రయ పడింది.ఇప్పుడు.. హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించడంతో ఎస్ఈసీ విధి నిర్వహణకు అడ్డు చెప్పడం కోర్టు ధిక్కరణ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
గతంలో ఎస్ఈసీకి ఎన్నికల నిర్వహణలో సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ ప్రభుత్వం సహకరించడం లేదు. రెండు సార్లు వీడియో కాన్ఫరెన్స్ వాయిదా వేయించింది. ఓటర్ల జాబితా సిద్ధం చేసే విషయంలోనూ సహకరించడం లేదు. కోర్టుల్లో ప్రయత్నాలు చేసి.. ఆలస్యం చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం సానుకూల ఫలితం రాదని తెలిసి కూడా.. హైకోర్టులో పిటిషన్లు వేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.