పోలీసు వ్యవస్థను కంట్రోల్ చేయడం చేత కాకపోతే రాజీనామా చేయాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్‌కు హైకోర్టు సూటిగా సలహా ఇచ్చింది. ఎన్ని సార్లు చెప్పినా.. ఏపీలో రూల్ ఆఫ్ లా అమలు కావడం లేదని…మండిపడింది. గౌతం సవాంగ్‌పై హైకోర్టు ఇంత తీవ్ర స్థాయిలో మండిపడటానికి కారణం… పోలీసులు చట్ట విరుద్ధంగా మరో వ్యక్తిని అపహరించడం.. ఆ వ్యక్తి కుటుంబసభ్యులు కోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడమే. అమలాపురం మం. ఇందుపల్లిలో వెంకటరాజు అనే వ్యక్తిని పోలీసులు తీసుకెళ్లారు. కానీ తమ కస్టడీలో లేరని పోలీసులు చెబుతున్నారు. దీనిపై హైకోర్టులో బాధితుడి మేనమామ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు తీసుకెళ్లారనడనికి ఆధారాలు సమర్పించారు. దీంతో వెంకటరాజు విషయంలో పోలీసుల తీరును హైకోర్టు తప్పు పట్టింది.
హైకోర్టు తీవ్రంగా స్పందించడానికి కారణం గతంలో ఇలాంటి కేసులో మూడు నాలుగు సార్లు హైకోర్టు ముందుకు వచ్చాయి. గుంటూరులో యువకుల్ని ఇలా అక్రమంగా నిర్బంధించిన కేసులో సీబీఐ విచారణకు కూడా ఆదేశించింది. అలాగే విశాఖలో…తూ.గో జిల్లాలో కూడా మరో రెండు ఘటనల్లో పోలీసుల తీరు వివాదాస్పదయింది. ఈ కారణంగా ఏపీ లో రూల్ ఆఫ్ లా ను అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని హైకోర్టు పదే పదే హెచ్చరిస్తూ వస్తోంది. రెండు, మూడు సార్లు డీజీపీని స్వయంగా హైకోర్టుకు పిలిపించిన ధర్మానసం.. వివరణ కూడా అడిగింది. అయినప్పటికీ.. పోలీసుల తీరులో మార్పు రాలేదు. దీంతో హైకోర్టు డీజీపీ తీరుపై విరుచుకుపడింది.
ఏపీలో పోలీస్ వ్యవస్థ గాడితప్పుతోందని.. రూల్ ఆఫ్ లా అమలు కావడం లేదని ఆగ్రహం వ్యకం చేసింది. గతంలో డీజీపీని పలు సార్లు కోర్టుకు పిలిపించినా మార్పు రాలేదని.. మూడు సార్లు జ్యుడీషియల్ విచారణ చేస్తే పోలీసులదే తప్పని తేలిందని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రతి కేసులో సీబీఐ విచారణ సాధ్యం కాదన్న హైకోర్టు.. ప్రతిసారి ఇలాంటి పరిస్థితే వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందని వ్యాఖ్యానించింది. ఏపీలో పోలీసుల తీరుపై చాలా రోజులుగా అనేక విమర్శలు వస్తున్నాయి. చట్టాలను కొంత మందికే అన్వయించడం… రాజకీయ కారణాలతో కొంత మందిపై కేసులు పెట్టడం.. వారిని అపరహించడం వంటివి చేస్తున్నారన్న ఆరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి. హైకోర్టు ఎన్ని సార్లు ఘాటు హెచ్చరికలు చేసినా పరిస్థితిలో మార్పు రావడంలేదు.