సీఐడీని ఉపయోగించుకుని వెబ్సైట్లు, యూట్యూబ్ చానల్స్‌పై వరుస పెట్టి కేసులు పెడుతున్న ఏపీ సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కొన్నాళ్ల క్రితం.. హైదరాబాద్‌లో ఉన్న తెలుగు వన్ అనే వెబ్ సైట్ , యూట్యూబ్ చానల్ పై ఏపీ సీఐడీ పోలీసులు ఒక్క సారిగా దాడి చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియోలు పెట్టారని.. తమ మనోభావాలు దెబ్బతీశారని కొంత మంది ఫిర్యాదు చేశారన్న కారణం చూపి.. యజమాని కాటంనేని రవిశంకర్‌పై సీఐడీ కేసులు పెట్టారు. అర్థరాత్రి పూట.. ఆఫీసులో సోదాలు చేసి.. ఎక్విప్మెంట్ను తీసుకుపోయారు.
అప్పట్లో ఈ అంశం కలకలం రేపింది. అయితే కాటమనేని రవిశంకర్.. సీఐడీ పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సీఐడీ పోలీసుల తీరును తప్పు పట్టింది. సీఐడీ పెట్టిన కేసులను కొట్టివేస్తూ తీర్పు చెప్పింది. కేసు విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందని.. పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి..పోతుంటాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీఐడీ సీజ్ చేసిన ఎక్విప్మెంట్ 7 రోజుల్లోగా స్వాధీనం చేయాలని హైకోర్టు ఆదేశించింది. నిజానికి కాటంనేని రవిశంకర్ హైకోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేశారు.
కానీ అనేక మందిని నోటీసుల ద్వారానే ప్రభుత్వం భయపెట్టిందనే విమర్శలు ఉన్నాయి. పలు యూట్యూబ్ చానళ్ల నిర్వహకులపై కేసులు పెట్టడం.. వారిని అర్థరాత్రుళ్లు అరెస్ట్ చేయడం వంటి పరిణామాలు చాలా చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం అలా వేధింపులు ఎదుర్కొన్న వారందరికీ ఈ తీర్పుతో ధైర్యం వచ్చినట్లయింది.