టీడీపీ హయాంలో అక్రమాలంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కతొలి విచారణలు తుస్సుమంటున్నాయి. రఘునాథరెడ్డి అనే ఐపీఎస్ అధికారి నేతృత్వంలో ముందుగా.. రాజధానిలో భూముల కొనుగోళ్ల పై దృష్టి సారించింది. కొద్ది రోజుల కిందట… బెదిరించి అసైన్డ్ భూములు కొనుగోలు చేశారంటూ..సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ కేసులను పరిశీలనలోకి తీసుకున్న సిట్… నాలుగైదు రోజుల కిందట సోదాలు ప్రారంభించింది. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బినామీలంటూ… కృష్ణా, గుంటూరు జిల్లాలో కొంత మంది ఇళ్లపై దాడులు చేసిన సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. వారిలో కొంత మంది హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఎవరూ ఫిర్యాదు చేయకుండా.. సీఐడీ కేసు నమోదు చేసి..సోదాలు చేయడం ఏమిటని హైకోర్టు ప్రశ్నిస్తూ… ప్రొసీడింగ్స్‌ను నిలిపివేయాలని ఆదేశించింది. అసైన్డ్ భూములు కొనుగోలు చేశారంటూ.. మంగళగిరిలో సీఐడీ నమోదు చేసిన కేసులో అన్ని రకాల ప్రోసిడింగ్స్ నిలిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. తమపై అకారణంగా సీఐడీ కేసు నమోదు చేసిందని కంచికచర్లకు చెందిన నన్నపనేని సీతారామరాజు, కృష్ణమూర్తి హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీరి ఇళ్లలో సిట్ సోదాలు చేసిది. తాము ఎలాంటి అసైన్డ్ భూములు కొనలేదని పిటిషనర్లు కోర్టుకు చెప్పారు. ఎవరూ ఫిర్యాదు చేయకుండా ఎలా సోదాలు చేస్తారని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
ప్రోసిడింగ్స్ నిలిపివేయాలని ఆదేశించింది. ఎవరూ ఫిర్యాదు చేయకుండా.. కేసులు నమోదు చేస్తూ.. సీఐడీ అధికారులు కొత్త సంప్రదాయాల్ని నెలకొల్పుతున్న వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. గత ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ విచారించడానికి సిట్ ఏర్పాటయింది. ఇప్పుడు..సిట్ ప్రత్యేకంగా కేసులు నమోదు చేయడానికి అవకాశం లేకుండా పోయింది.ఫిర్యాదులు లేకుండా కేసులు లేకుండా సోదాలు నిర్వహిస్తే.. అది చట్ట ఉల్లంఘన అవుతుంది.