పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లుల ఆమోదం, గెజిట్ విడుదలపై హైకోర్టు స్టేటస్ కో విధించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలుకు 10 రోజుల సమయం కోరిన ప్రభుత్వ తరపు న్యాయవాది కోరారు. దానికి అంగీకరించిన కోర్టు… అప్పటి వరకూ..స్టేటస్ కో అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ నెల 14వ తేదీకి కేసు విచారణ వాయిదా వేసింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లుల ఆమోదం బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరుపు న్యాయవాదులు వాదించారు. దీనిపై ప్రభుత్వం రిప్లై కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ బిల్లులపై యథాతథ స్థితి కొనసాగించడం అంటే.. ఆ బిల్లుల ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవడానికి లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. అంటే.. హైకోర్టులో విచారణ పూర్తయ్యే వరకూ…, ఆ బిల్లుల ఆధారంగా… రాజధాని తరలించడం సాధ్యం కాదు.
మండలిలో సెలక్ట్ కమిటీలో ఉన్న బిల్లుల్నే ప్రభుత్వం మళ్లీ అసెంబ్లీలోపెట్టి ఆమోదింప చేసుకుని చట్ట రూపంలోకి తీసుకు వచ్చిందని… ఇది రాజ్యాంగ విరుద్దమని.. విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. న్యాయనిపుణులు కూడా అదే చెబుతున్నారు. మూడురాజధానులు అనేది… విభజన చట్టాన్ని అధిగమించేలా ఉందని.. హైకోర్టు ఎక్కడ ఉండాలో చెప్పే అధికారం ప్రభుత్వానికి.. లేదని.. ఆ అంశంపై చట్టం చేయలేరని అంటున్నారు. ఈ అభ్యంతరాలు అన్నీ వివరిస్తూ.. హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి.
గవర్నర్ ఆమోదించినా… ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినా… న్యాయసమీక్షకు లోబడే ఉంటాయని.. న్యాయనిపుణులు చెబుతున్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించేదిగా ఉంటే… చట్టాలను సైతం.. కొట్టి వేసే హక్కు కోర్టులకు ఉందని వాదిస్తున్నారు. ఇప్పుడు… మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు చట్టాలు న్యాయసమీక్షకు వెళ్లాయి. దీనిపై హైకోర్టు విచారణ ఆసక్తి రేపుతోంది.