చిత్తూరు జిల్లాలో అమరరాజా సంస్థకు కేటాయించిన భూములను వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే ఇచ్చింది. తమకు కేటాయించిన భూములను వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై అమరరాజా ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసింది. దానిపై విచారణ జరిపిన హైకోర్టు జీవో అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో చిత్తూరు జిల్లాలో అమరరాజా సంస్థకు 483 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. ఒప్పందం ప్రకారం.. ఉద్యోగాలు కల్పించలేదని.. ఆ భూముల్లో 253 ఎకరాలను వెనక్కి తీసుకునేందుకు జగన్ సర్కార్ జీవో జారీ చేసింది.
తాము సేల్ డీడ్ అగ్రిమెంట్ ద్వారా ఏపీఐఐసీ దగ్గర భూములు కొనుగోలు చేస్తే.. ప్రభుత్వం ఎలా రద్దు చేస్తుందని.. ప్రభుత్వం జారీ చేసిన జీవో చెల్లదని… అమరరాజా సంస్థ హైకోర్టులో వాదించింది. ఆ భూమిని ప్రభుత్వం ఏపీఐఐసీకి విక్రయించిందని.. ఏపీఐఐసి తమకు విక్రయించిందని.. ఒప్పందం ప్రకారం… తాము కల్పిస్తామని చెప్పిన ఉద్యోగాల కన్నా ఎక్కువే కల్పించామని హైకోర్టు దృష్టికి అమరరాజా సంస్థ తీసుకెళ్లింది.గతంలో ఈ పిటిషన్పై విచారణ జరిగినప్పుడు అమరరాజా సంస్థ ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు చేస్తామని చెప్పి … ఏర్పాటు చేయలేదని.. ఇంకా ఉల్లంఘనలు ఉన్నాయని… విడిగా వివరణ పత్రం దాఖలు చేస్తామని కోర్టుకు తెలపింది. కానీ ఆ ఉల్లంఘనలేమిటో స్పష్టంగా చెప్పలేకపోయారు.
ఆ భూములు రద్దు చేయడానికి ప్రభుత్వం కేటాయించలేదని.. ఏపీఐఐసీ నుంచి కొనుగోలు చేశామని అమరరాజా వాదిస్తోంది. ఇలాంటి వ్యవహారాల్లో.. ప్రభుత్వం రద్దు ఉత్తర్వులు చెల్లవని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అమరరాజా సంస్థ తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందినది. అందుకే.. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే భూములను రద్దు చేశారని ఆరోపణలు వచ్చాయి.