విజయనగరం ఎమ్మెల్సీ ఎన్నిక సందిగ్ధంలో పడింది. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై మండిల చైర్మన్ అనర్హతా వేటు వేశారు. ఆ అనర్హతా వేటు చెల్లదని ఏపీ హైకోర్ టుతాజాగా తీర్పు ఇచ్చింది. కానీ ఇప్పటికే ఆ స్థానానికి ఈసీ నోటిఫికేషన్ ఇచ్చేసింది. ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కాలేదని కోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి ఆ స్థానానికి ఎన్నికలు నిర్వహించలేరు. కానీ ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. కోర్టు ఉత్తర్వులు అందిన తర్వాత ఈ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఇందుకూరి రఘురాజు వైసీపీ ఎమ్మెల్సీగా ఉండేవారు. ఆయనకు వైసీపీతో సరిపడలేదు. అయితే ఆయన పార్టీ మారలేదు. ఆయన కుటుంబసభ్యులంతా పార్టీ మారిపోయారు. కానీ ఒక రోజు అర్థరాత్రి హఠాత్తుగా ఆయన పార్టీ ఫిరాయించారని నిర్దారిస్తూ మండలి చైర్మన్ ఉత్తర్వులు ఇచ్చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం కనీసం వివరణ తీసుకోకుండా.. విచారణ చేయకుండా.. ఆధారాల్లేకుండా అనర్హతా వేటు వేశారని రఘురాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరుగుతున్న సమయంలోనే ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చేసింది.
ఇప్పుడు అనర్హతా వేటును రద్దు చేయడంతో వైసీపీ సుప్రీంకోర్టుకు వెళ్తుందా లేకపోతే ఎన్నికకు నామినేషన్ వేస్తుందా అన్నది తేలాల్సి ఉంది. ఉదయమే విజయనగరం నేతలతో సమావేశం అయిన జగన్ బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడును అభ్యర్థిగా ఖరారు చేశారు. బొత్స కుటుంబీకులు పోటీకి వ్యతిరేకత వ్యక్తం చేయడమే దీనికి కారణం. కానీ అభ్యర్థిని ఖరారు చేసిన కాసేపటికే కోర్టు తీర్పు వచ్చింది.