ఆంధ్రప్రదేశ్లో కరోనా డేంజర్ జోన్లోకి చేరుతోంది. ఒక్క రోజులో 465 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. వీటిలో విదేశాల నుంచి వచ్చి 19 మందికి, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 70 మందికి కరోనా పాజిటివ్ కాగా.. ఏపీలో ఒకరి నుంచి మరొకరి.. మరో 376 మందికి సోకింది. ఇప్పటివరకు మొత్తం 7,961 కేసులు నమోదు అయ్యాయి. మొదట రోజుకు వంద కేసులు.. తర్వాత రెండు వందలు.. తర్వాత మూడు వందలు..ఇప్పుడు నాలుగు వందలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మెట్రో సిటీ లేదు. హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ లాంటి మెట్రో నగరాలు మాత్రమే.. హాట్ స్పాట్లుగా ఉన్నాయి. దేశంలో నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో మెజార్టీ అలాంటి మెట్రో నగరాలున్న రాష్ట్రాల నుంచే వస్తున్నాయి.
అనూహ్యంగా..అలాంటి మెట్రో నగరాలు ఏమీ లేకపోయినా.. ఏపీలో మాత్రం ప్రమాదకరంగా వైరస్ విస్తరిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతూండటం ప్రభుత్వ వర్గాలకు సైతం ఆందోళన కలిగిస్తోంది. వైరస్ సామాజిక వ్యాప్తి దశకు చేరిందనే భావన అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. లాక్ డౌన్ సడలింపులు ఇచ్చే వరకూ… ఏపీలో కరోనా పరిస్థితి కంట్రోల్లోనే ఉంది. పది, ఇరవై కేసులు మాత్రమే రోజుకు నమోదయ్యేవి. ఇప్పుడు అవి వందలకు చేరుకుంటున్నాయి. మద్యం దుకాణాలు ప్రారంభించినప్పటి నుండే.. ఈ పెరుగుదల ఉంది. ఆ తర్వాత సడలింపులు పూర్తి స్థాయిలో ఇచ్చారు. త్వరలో బస్సులను కూడా ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పుడు వైరస్ ను కట్టడి చేయడం సాధ్యం కాదని..ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలన్న విజ్ఞాపనలు ఏపీ అధికారవర్గాల నుంచి వస్తున్నాయి. వైరస్ ప్రమాదకరంగా విస్తరించడానికి.. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ కారణం అన్న చర్చ జరుగుతోంది. ఐసీఎంఆర్ బృందాలు ఏపీకి పెద్దగా రాలేదు. ఇదే తరహాలో ఇక ముందు కూడా కేసులు నమోదయితే.. ఐసీఎంఆర్ బృందాలు కమ్యూనిటి ట్రాన్స్మిషన్ మీద పరిశీలన జరపడానికి వచ్చే అవకాశం ఉంది.