ప్రతి పది లక్షల మందిలో 331 మందికి వైరస్ టెస్టులు చేస్తున్నట్లుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఈ సగటు సంఖ్య మిలియన్‌కు 198 మాత్రమే. ఏపీలో మాత్రం.. ఏకంగా మిలియన్‌కు 331 మందికి పరీక్షలు చేస్తున్నారు. ఏపీలో వైరస్ టెస్టులు వేగంగా చేయడం లేదని.. కొద్ది రోజులుగా.. విపక్ష పార్టీలు… నిపుణులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సమయంలో.. ప్రభుత్వం తాము చేసిన లెక్కలను బయట పెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టెస్టింగ్ ల్యాబ్స్ ఏడు ఉన్నాయి. ఇందులో రెండు వారం రోజుల కింద నుంచే పని చేయడం ప్రారంభించాయి. వారం రోజుల కిందటి వరకూ ఐదు మాత్రమే ఉన్నాయి.
వీటి ద్వారానే ఇప్పుడు.. రోజుకు మూడు వేల శాంపిళ్ల ద్వారా కరోనా ఉందో లేదో గుర్తిస్తున్నారు. దేశంలో 2 లక్షలకుపైగా పరీక్షలు జరిగాయని… ప్రతి మిలియన్ కు 198 మంది సగటున పరీక్షలు చేస్తున్నారని ప్రభుత్వం తరపున కరోనా వ్యవహారాల్ని డీల్ చేస్తున్న జవహర్ రెడ్డి ప్రకటించారు. ఏపీలో ఇప్పటి వరకూ 16 వేల 655 మందికి పరీక్షలు చేశారు. రోజుకు 17 వేల టెస్ట్ లు నిర్వహించాలి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తక్కువ పరీక్షలు చేసి వైరస్ వ్యాప్తి లేదని అనుకోవడం మనల్ని మనం మభ్యపెట్టుకోవడమేనని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తంగా లక్షల టెస్టులు నిర్వహిస్తామని.. జవహర్ రెడ్డి చెబుతున్నారు. నిజానికి ఏడు ల్యాబుల ద్వారా రోజుకు మూడు వేల టెస్టులు చేయడం అంటే.. చాలా వేగంగా చేస్తున్నట్లేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఒక్కో ల్యాబ్‌లో రోజుకు నాలుగు వందలకుపైగా పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అలా చేయడానికి నిపుణులు అందుబాటులో ఉన్నారా.. అన్న సందేహాలు కూడా చాలా మందిలో ఉన్నాయి. ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని.. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో… బేసిక్ టెస్టింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కన్నా ఎక్కువగా.. టెస్టులు చేస్తున్నట్లుగా క్లెయిమ్ చేసుకుంటూండటంతో.. మరింత ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి. కేరళ లాంటి రాష్ట్రాలు కూడా.. ఇప్పటి వరకూ.. ఇరవై వేల టెస్టులను పూర్తి చేయలేకపోయింది. కానీ ఏపీ సర్కార్ మాత్రం…లక్షల్లో టెస్టులు పూర్తి చేస్తామని దీమా వ్యక్తం చేసేస్తున్నారు.