” నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో… తెలంగాణలో ఉద్యమం జరిగింది. అందరూ కలిసి చేసుకున్న అభివృద్ధిలో.. వాటా లేదని కూడా చెప్పారు. కట్టుబట్టలతో పంపేశారు. ఇప్పుడు అదే రాష్ట్రంలో ఏపీ ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కట్టడం ఏమిటి..? ప్రాజెక్టు కట్టిన తర్వాత ” దిక్కున్న చోట” చెప్పుకోమంటే.. పరిస్థితి ఏమిటి..? ఏ రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందాలు అమలవుతున్నాయి…? ” .. గోదావరి జల వినియోగంపై.. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రసంగంలోని ప్రధాన అంశం ఇదే. రెండు బిందెల నీటి కోసం కొట్లాడుకుంటున్న ఈ రోజుల్లో… ఏపీ ప్రజల భవిష్యత్‌ను.. తెలంగాణకు తాకట్టు పెట్టేలా వ్యవహరించవద్దని ఆయన చెప్పారు. ఆయనే కాదు.. ముఖ్యమంత్రి చంద్రబాబూ అదే చెప్పారు. ప్రజల భవిష్యత్ ప్రయోజనాలను దెబ్బతీసే హక్కు లేదన్నారు. కానీ.. దీనంతటికి సీఎం జగన్ సమాధానం… ఒకటే… ” తెలంగాణ ఎగువ రాష్ట్రం.. ఆ రాష్ట్రం నీళ్లు వదిలితేనే.. మనకు నీళ్లొస్తాయి… అందుకే తెలంగాణతకో స్నేహం ఉండాలని..”
తెలంగాణతో నీటి హక్కుల గురించి పోట్లాడకూడదా..?
ఆంధ్రా ప్రాజెక్టులతో ఏపీకి ఉపయోగం ఉండదా..? తెలంగాణతో సఖ్యతగా ఉంటేనే దిగువకు నీళ్లొస్తాయా..?… ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గోదావరి జలాల వినియోగంపై.. జరిగిన చర్చలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన విన్న ఎవరికైనా ఇదే అనుమానం రాక మానదు. ఎగువ రాష్ట్రంతో సఖ్యతగా ఉంటే.. కిందకు నీళ్లొస్తాయని మరోసారి తన అభిప్రాయాన్ని నొక్కి చెప్పారు. కేవలం 12 శాతం గోదావరి నీళ్లు మాత్రమే ఏపీలోకి వస్తున్నాయని జగన్ చెప్పుకొచ్చారు. కేవలం ఐదు టీఎంసీలు మాత్రమే మన ఆధీనంలోఉంటాయన్నారు. అక్కడ కేసీఆర్ కాళేశ్వరం ప్రారంభించి పూర్తి చేశారని … ఇక్కడ చంద్రబాబు ఏం చేయగలిగారని ప్రశ్నించారు. జగన్ మొత్తం ప్రసంగంలో ఒక్క చోట కూడా.. ఏపీ జల హక్కుల గురించి మాట్లాడలేదు. అవి ఏపీ హక్కు అని వాదించలేదు. ఎంత సేపూ.. ఎగువ రాష్ట్రం దయా దాక్షిణ్యాలపై ఆధారపడాలేనే చెప్పుకొచ్చారు.
ఏపీని కట్టుబానిసగా మార్చాలని కంకణం కట్టుకున్నారా..?
ఏపీ ఒక్కటిగా ఉండాలని.. జగన్ ఆకాంక్షించారు. మొన్నమధ్య జరిగిన సమావేశంలో కేసీఆర్ కూడా అదే అన్నారు. కానీ ఆయన తెలంగాణ ప్రయోజనాలను కాంక్షించే ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమం చేశారు. ఆయనకు తెలంగాణ ప్రయోజనాలు తప్ప.. మరేం అక్కర్లేదనేది శిలాశాసనం లాంటిది. పైకి ఎన్ని మాటలైనా చెప్పొచ్చు. కానీ.. ఏపీ సీఎంకు.. ఆయనకు ఉన్న తెలివితేటలన్నీ కాకపోయినా కనీస సోయి ఉండాలి కదా..! మనది దిగువ రాష్ట్రం..ఎగువ రాష్ట్రం వదిలితేనే మనకు నీళ్లు వస్తాయని.. అందుకే… కేసీఆర్‌కు కట్టు బానిసగా ఉండాల్సిందేన్న అభిప్రాయాన్ని పదే పదే మాటల్లో ఎందుకు వ్యక్తం చేస్తున్నారు.
పోలవరం కూడా అవసరం లేదని జగన్ చెప్పినట్లేనా..?
పోలవరం ప్రాజెక్ట్ అవసరం లేదని.. అసెంబ్లీలో పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. పోలవరం లాంటి భారీ ప్రాజెక్ట్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. గుట్టల మధ్య డ్యాములు కట్టే కాలం పోయిందని జగన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఎక్కడికక్కడ బ్యారేజీలు కడుతున్నారన్నారు. అదే తమ విధానం అన్నట్లుగా చెబుతున్నారు. ఇప్పుడు.. పోలవరంకు బదులుగా… తెలంగాణతో కలిసి శ్రీశైలంకు గోదావరి నీటిని తరలించే ప్రాజెక్ట్ చేపట్టి… పోలవరంను నిలిపి వేయడానికి గ్రౌండ్ వర్క్ జరుగుతున్న భావనను జగన్మోహన్ రెడ్డి కల్పించారు. పోలవరం వద్దని తెలంగాణ చెబుతోంది. దానికి తగ్గట్లుగానే జగన్మోహన్ రెడ్డి నడుచుకుంటున్నారు. మొత్తానికి.. ఏపీని ఇప్పటికే.. ఎగువ రాష్ట్రానికి కట్టుబానిసగా మార్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మున్ముందు.. ఎలా ఉంటుందో..?