ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లింపులు ఆగిపోయాయి. జీతాలు పెన్షన్లు తప్ప ఎలాంటి పేమెంట్లూ చేయరాదని ఆర్ధిక మంత్రిత్వ అధికారులు ట్రెజరీలకు ఐదురోజుల క్రితం నోటిమాటగా సూచించారు. మరోవైపు రాజధాని శంకుస్ధాపనకు 150 కోట్లరూపాయలు ఖర్చు చేస్తున్నారనీ, ఇందులో 100 కోట్ల రూపాయలు ఓవర్ డ్రాఫ్ట్ గా తీసుకుంటున్నారని తెలిసింది. అపుడపుడూ ఖజానా క్షీణించి పోవడం ఏరాష్ట్రానికైనా మామూలే. 16 వేలకోట్ల రూపాయల ద్రవ్య లోటుతో విడిపోవడమంటే డబ్బు కష్టాలతో జీవితం ప్రారంభించడమే. అత్యవసర పరిస్ధితుల్లో గట్టెక్కడానికి ‘వేస్ అండ్ మీన్స్’ పద్దు నుంచి డబ్బు వాడుకోవచ్చు…ఆపరిమితి మించిపోతే ఎక్కువ వడ్డీకి ఓవర్ డ్రాఫ్ట్ వాడుకోవచ్చు. ఇపుడు ఆంధ్రప్రదేశ్ రెండోదశలోకి వచ్చింది. ఇప్పటికే వాడుకున్న 770 కోట్లరూపాయలు పరిమితిని దాటిపోవడం వల్ల వేస్ అండ్ మీన్స్ ఖాతాలో ఇకపై ఒక్కరూపాయి కూడా అదనంగా వాడుకునే అవకాశంలేదు. ఇపుడు 100 కోట్లరూపాయల ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోడానికి ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి హెచ్చు వడ్డీ పడుతుంది. 14 రోజుల్లో బాకీ తీర్చెయ్యాలి. ఆలోగా డబ్బు సమకూర్చుకోలేకపోతే ఆప్పుతీర్చడానికి మరో అప్పు చేయాలి.
ఆర్ధికశాస్త్రం కూడా చదువుకున్న అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబుకి రుణభారంలో సాధకబాధకాలు బాగాతెలుసు. చంద్రబాబు ప్రభుత్వం దుబారా ఖర్చులమీద ఇప్పటికే బయటినుంచి విమర్శలు మొదలయ్యాయి. రాజధాని శంకుస్ధాపన కార్యక్రమానికి 150 కోట్లరూపాయలు ఖర్చుపెడుతున్నారనీ, ప్రస్తుత పరిస్ధితుల్లో ఇంత ఖర్చు పూర్తిగా అనవసరమనీ ప్రభుత్వ అధికారులే ఆంతరంగిక సమావేశాల్లో గట్టిగా విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి పేషీ ప్రజలతో సంబంధం వున్న కార్యాలయంగా కాక, కార్పొరేట్ ఆఫీస్ గా మారిపోయిందని, ఇద్దరు జూనియర్ అధికారులే సీనియర్ల మీద పెత్తనం చేసే పరిస్ధితి వచ్చిందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి నివాసం విజయవాడకు మారాక ఈ వాతావరణం మరీ పెరిగిపోయిందనికూడా అంటున్నారు.