కరీంనగర్ జిల్లా ధర్మపురిలో సర్వే చేస్తూ.. ఏపీ ఇంటలిజెన్స్ పోలీసులు దొరికారంటూ.. టీఆర్ఎస్ ఆరోపణలు చేసింది. దీనికి కొద్దిగా మసాలా జోడించి డబ్బులు పంచుతున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా.. తెలంగాణ ఎన్నికల అధికారి రజత్ కుమార్ సైనీ… ఏపీ డీజీపీకి నోటిసులు పంపారు. టీఆర్ఎస్ ఇచ్చిన వీడియోలను కూడా ప్రస్తావిస్తూ దానికి సంబంధించి వివరణ కావాలని కోరారు. దీనిపై ఎపీ డీజీపీ ఆర్.పి.ఠాకూర్ … ఇంటెలిజెన్స్ ఛీఫ్ ఎబీ వెంకటేశ్వరరావును నివేదిక అడిగారు. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎపీ డీజీపీ ఆర్.పి. ఠాకూర్ తెలంగాణ ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ కు లేఖ పంపారు.
వీడియోలో ఉన్న కానిస్టేబుళ్లు ఐదుగురు ఎపీ ఇంటెలిజెన్స్ కు చెందిన వారేనని ఏపీ డీజీపీ స్పష్టం చేశారు. ధర్మపురిలో మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు వారు అక్కడకు వచ్చారని వివరించారు. తెలంగాణ ఎన్నికల కమిషనర్ పంపించిన వీడియోలో కూడా ఎక్కడా కానిస్టేబుళ్ల వద్ద డబ్బు ఉన్నట్లుగానీ, డబ్బు పంపిణీ చేసినట్లు గానీ ఆధారాలు లేవని ఈ సందర్భంగా ఎపీ డీజీపీ ఠాకూర్ .. ఈసీకి ఘాటుగానే సమాధానం ఇచ్చారు. హైదరాబాద్ లో ఏపీ ఇంటిలెజెన్స్ యూనిట్ ఉందని డీజీపీ లేఖలో గుర్తు చేశారు. హైదరాబాద్ లో ఉంటున్న ఏపీ వీఐపీలు, అక్కడ ఉన్న ఎపీ ఆస్తులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
ఆ పని మీదే కానిస్టేబుళ్లు అక్కడ హైదరాబాద్ లో ఉన్నారని చెబుతూ మావోయిస్టు తీవ్రవాదానికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు, వారి కదలికల గురించి సమాచారం రాబట్టేందుకు ఇంటెలిజెన్స్ పోలీసులు సంచరిస్తూ ఉంటారని కూడా ఆయన పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ కానిస్టేబుళ్లు డబ్బులు పంపిణీ చేయడం గానీ, అక్కడ తెలంగాణా ఎన్నికలతో గానీ వారికి సంబంధం లేదని కూడా డీజీపీ స్పష్టం చేశారు. ఈ లేఖపై ఈసీ స్పందించాల్సి ఉంది. నిన్నటికి సమాధానం ఇవ్వలేదన్న కారణం చెప్పి రజత్ కుమార్.. ఏపీ పోలీసుల్ని బందోబస్తుకో తీసుకోబోమంటూ ప్రకటన చేసేశారు.