ఏపీ తెలంగాణ మధ్య విద్యుత్ బకాయిల వివాదం రాజుకుంది. తమకు ఐదు వేలకోట్లు ఇవ్వాలని ఏపీ అంటూంటే తెలంగాణ మాత్రం.. మీరే మాకు మూడు వేల ఐదు వందల కోట్లు ఇవ్వాలని వాదిస్తోంది. ఇది రెండు రాష్ట్రాల మధ్య మరో వివాదం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం నుంచి విద్యుత్ బకాయిలు రావాల్సి ఉందని ఏపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతోంది. తాజాగా తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన అంశాలపై కేబినెట్లో కూడా చర్చించారు. ఈ విషయాన్ని చంద్రబాబు మీడియా సమావేశంలో కూడా ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం తమకు ఐదు వేలకోట్ల విద్యుత్ బకాయిలు ఇవ్వాలని, ఏపీపై అంత ప్రేమ ఉంటే ముందుగా వాటిని తమకు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు రెండు రోజుల కిందట డిమాండ్ చేశారు.
చంద్రబాబు వ్యాఖ్యలకు తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ వచ్చింది. ఏపీకి అసలు ఏమీ ఇవ్వాల్సి లేదని.. ఏపీ తమకు 2400 కోట్లు ఇవ్వాల్సి ఉందని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఏండీ ప్రభాకర్ రావు తేల్చిచెప్పారు. అన్నీ లెక్కలు చూసుకుందామని చాలా సార్లు ఏపీ విద్యుత్ సంస్థలకు లేఖలు రాశామని అయినా వారి నుంచి స్పందన లేదన్నారు. సమాచార లోపం వల్లే ఏపీ ప్రభుత్వ పెద్దలు ఇలా మాట్లాడారని అనుకుంటుంన్నామని సెటైర్ వేశారు. ఏపీ తమకు 2400 కోట్లు ఇవ్వాల్సి ఉందని, అన్నీ లెక్కలు వేస్తే మరో పదకొండు వందల కోట్లు ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రభాకర్ రావు వడ్డీ లెక్కలేసినట్లుగా ఉన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో విద్యుత్ డిమాండ్ ఎక్కువ ఉంటున్న కారణంగా విభజన చట్టంలో యాభై ఏడు శాతం కరెంట్ ను తెలంగాణకు కేటాయించారు. ఏపీకి కేవలం 43 శాతం కేటాయించారు. అదనంగా తెలంగాణకు ఇస్తున్న కరెంట్‌కు తెలంగాణ డబ్బుులు చెల్లించాలి. మూడున్నరేళ్ల పాటు కరెంట్ తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఇంత వరకూ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. అడిగి.. అడిగి .. చివరికి ఏపీ ప్రభుత్వం కరెంట్‌ను తెలంగాణ ప్రభుత్వానికి నిలిపి వేసింది. అయినప్పటికీ కరెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రభుత్వం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో కేసు వేసింది. తెలంగాణ జెన్కోను దివాలా దీసినట్లుగా ప్రకటించి తమకు రావాల్సిన నిధులు తమకు ఇప్పించాలని కోరింది. ప్రస్తుతం తెలంగాణ జెన్కో, ఏపీ జెన్కో మధ్య ఈ వివాదం.. కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఉంది. దేశంలో ఓ ప్రభుత్వ సంస్థ మరో ప్రభుత్వ సంస్థపై ఇలా దావా వేయడం ఇదే మొదటి సారి.