ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎకనమిక్ టైమ్స్ పత్రికకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ‘ప్రత్యేక హోదా ఇచ్చి రాష్ట్రాభివృద్ధి కేంద్రం సహకరిస్తే 2019 ఎన్నికలలో ఆ క్రెడిట్ మొత్తం మీరే స్వంతం చేసుకొంటారనే భయంతోనే కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వడం లేదా?” అని సూటిగా ప్రశ్నకు ఆయన చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పారు.
“కేంద్రం ఆవిధంగా ఆలోచిస్తోందని నేను భావించడం లేదు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి దానికి కొన్ని ఇబ్బందులున్నాయి. అందుకే ఇవ్వలేకపోతోందని నేను భావిస్తున్నాను. కానీ ఎప్పటికైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తుందనే
ఆశిస్తున్నాను,” అని చెప్పారు. ప్రత్యేక హోదా గురించి రకరకాలుగా మాట్లాడుతున్న ఆయన ఇంటర్వ్యూలో చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పినప్పటికీ, అది కూడా ఒక ప్రధాన కారణమేనని అందరికీ తెలుసు. కేంద్రం ఇస్తున్న నిధులతో రాష్ట్రంలో అమలవుతున్న అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, నిరంతర విద్యుత్ సరఫరా వంటివన్నీ రాష్ట్ర ప్రభుత్వం పదకాలుగా చెప్పుకొంటున్నారని రాష్ట్ర భాజపా నేతలు తరచూ ఆరోపిస్తున్నారు. అయినా చంద్రబాబు నాయుడు వారి అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోకుండా వాటన్నిటినీ తన పద్దులోనే వ్రాసుకొంటున్నారు. ఆ క్రెడిట్లో కేంద్ర ప్రభుత్వానికి కానీ, రాష్ట్ర భాజపాకి గానీ వాటా పంచి ఇచ్చేందుకు ఆయన ఇష్టపడటం లేదు. భాజపా నేతలు అంత బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నా కూడా వారిని కలుపుకొనిపోవడం లేదు. కనీసం వారి ఆరోపణలు, విమర్శలకి సమాధానం కూడా చెప్పడం లేదు. ఈ రెండేళ్లలో కేంద్రం సుమారు రూ.1.42 లక్షల కోట్లు విలువ చేసే సంక్షేమ, అభివృద్ధి పనులకు నిధులు కేటాయించిందని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా చెప్పారు. కానీ దానినీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించడం లేదు. అలాగని గట్టిగా ఖండించడం లేదు కూడా. నిధులు ఇస్తున్నా ఇవ్వలేదని
ఆరోపిస్తూ, ఇచ్చిన వాటికి లెక్కలు చెప్పకుండా దుబారా చేస్తున్నారని భాజపా నేతలు ఆరోపిస్తున్నారు. తమకు దక్కవలసిన క్రెడిట్ ని చంద్రబాబు నాయుడు స్వంతం చేసుకోవడమే కాకుండా తిరిగి తమని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజల
ముందు దోషిగా నిలబెడుతున్నారని భాజపా అభిప్రాయపడుతోంది. అందుకే అమిత్ షా స్వయంగా వచ్చి రాష్ట్రానికి చేస్తున్న సహాయం గురించి చెప్పుకోవలసి వచ్చింది. కనుక రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి ఇది కూడా ఒక కారణమేనని చెప్పకతప్పదు. రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఇతర పనులకు నిధులు కేటాయించకపోవడానికి కూడా అదే కారణం అయ్యుండవచ్చు. అయితే తెదేపా ఆ క్రెడిట్ స్వంతం చేసుకొంటుందనే ఆలోచనతోనో, భయంతోనో రాష్ట్రానికి సహాయం
చేయకపోయినా, లేదా చంద్రబాబు నాయుడి ఈ వైఖరి కారణంగానే రాష్ట్రాభివృద్ధి కుంటుపడినా రాష్ట్రమే నష్టపోతుంది. అదే కనుక జరిగితే వచ్చే ఎన్నికలలో ఆ రెండు పార్టీలు కూడా అందుకు మూల్యం చెల్లించక తప్పదు.