కర్నూలు న్యాయరాజధాని కాదని ఏపీ ప్రభుత్వం మరోసారి స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. గతంలో కర్నూాలులో ఏపీ జ్యూడిషియల్ అకాడమీ పెడతామని జీవో జారీ చేసింది. ఇప్పుడు తీరా పెట్టాల్సి వచ్చే సరికి మంగళగిరిలో పెడుతోంది. కర్నూలులో జ్యూడిషియల్ అకాడమీని పెట్టాలన్న జీవోను క్యాన్సిల్ చేసి కొత్తగా మంగళగిరిలోనే జ్యూడిషియల్ అకాడమీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు నేతృత్వంలో ఇప్పటికే ఆ ఆకాడమీ పనులు జరుగుతున్నాయి. రెండు, మూాడు రోజుల్లో పూర్తవుతాయి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈ అకాడమీని ప్రారంభిస్తారు.
కర్నూలులో ఏపీ జ్యూడిషియల్ అకాడమీని ఎందుకు ప్రభుత్వం మంగళగిరికి తరిలించిందనేది సస్పెన్స్ గా మారింది. కర్నూలు న్యాయరాజధాని కోసం గర్జనల పేరుతో చేసిన హడావుడి ఏమయిందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై ఉద్యమాలు చేసిన వైసీపీ లాయర్లు, ఇతర నేతలు ఎందుకు నోరు మెదపడం లేదో మాత్రం స్పష్టత లేకుండా పోయింది. అయితే.. ఇలాంటి జీవో జారీ చేయడానికి ఏపీ ప్రభుత్వానికి అధికారం లేదన్న వాదన వినిపిస్తోంది. ఏపీ జ్యూడిషియల్ అకాడమీ ఎక్కడ పెట్టాలన్న ప్రభుత్వ ఇష్టం కాదు.. హైకోర్టు సూచనలతో జరగాలి.
హైకోర్టుతో సంబంధం లేకుండా కర్నూలులో జ్యూడిషియల్ అకాడమీ పెట్టాలన్న జీవో ప్రభుత్వం ఇచ్చేసిందని.. హైకోర్టు అంగీకరించకపోవడం… మంగళగిరిలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో.. చివరికి మార్పు చేస్తూ జీవో ఇవ్వక తప్పలేదంటున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లోనూ సంచలనం రేపుతోంది. వైసీపీ నేతల్లోనూ తమది చేతకానితనమన్న అభిప్రాయం రావడానికి కారణం అవుతోంది.