ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. ఈ సారి ఏపీలో మెజార్టీ సాధించాలనుకుంటున్నారు. అయితే.. సీట్లు సాధించేంత అత్యాశ వారేమీ పెట్టుకోవడం లేదు. కనీసం మెజార్టీ స్థానాల్లో డిపాజిట్లు తెచ్చుకోవాలనుకుంటున్నారు. అద్భుతం జరిగితే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రాతినిధ్యం ఉండాలనే ప్రయత్నం చేయాలనుకుంటున్నారు. కర్నూలులో రాహల్ గాంధీ సభ విజయవంతం అయిందని… సంతోషంగా ఉన్న నేతలు.. అప్పుడే భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు. ఏపీ వ్యవహారాల ఇన్చార్జ్ ఊమెన్ చాందీ ఎక్కువ సమయం.. ఏపీకే కేటాయిస్తున్నారు. సోమ, మంగళ వారాల్లో విజయవాడలోనే మకాం వేసి.. మొత్తం ఏపీ కాంగ్రెస్ను.. కార్యోన్ముఖుల్ని చేయబోతున్నారట.
రెండు రోజుల పాటు పార్టీ ముఖ్యనేతల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వివిధ అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. రాహుల్ గాంధీ నెలకొక జిల్లాలో పర్యటించే విధంగా ఎన్నికల పర్యటనను సిద్దం చేయాలని నిర్ణయించారు. వచ్చే నెలలో సభ ఎక్కడ నిర్వహించాలనే అంశంపై విజయవాడలో జరిగే సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. పార్టీలోకి వచ్చే ఇతర నాయకులు కూడా చేర్చుకునేందుకు ఈ సమన్వయ కమిటీ సమావేశంలో ప్రణాళికను ఖరారు చేస్తారు. పార్టీని వదిలి వెళ్లిపోయినా.. దూరంగా ఉంటున్న నేతలను మళ్లీ పార్టీలో చేర్చుకునేందుకు చర్చలు ప్రారంభించబోతున్నారు.
ప్రస్తుతం ఊమెన్ చాందీ.. కాంగ్రెస్ పార్టీ సంస్ధాగత నిర్మాణంపై దృష్టి పెట్టారు. కాంగ్రెస్ క్యాడర్ అంతా వైసీపీలోకి వెళ్లడంతో.. గ్రామస్థాయి వరకూ ఎవరూ మిగలలేదు.ఇప్పుడు మెల్లగా బూత్ కమిటీల నుంచి కార్యకర్తల్ని కూడ దీసుకునే ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్ారు. మండలాలు, గ్రామాలు, జిల్లా కమిటీల నియామకాలపై చాదీ కసరత్తు చేయనున్నారు. 2014 ఎన్నికలలో రాష్ట్ర విభజన కారణంగా ఒక్క నియోజకవర్గంలో కూడా డిపాజిట్లు దక్కించుకోని కాంగ్రెస్ ఈసారి ఓట్లశాతాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఇందుకోసం ప్రత్యేక హోదా అస్త్రాన్ని వాడుకోనుంది. కనీసం గౌరవప్రదంగా ఓటు బ్యాంక్ పెంచుకుంటే భవిష్యత్ ఉంటందని… కాంగ్రెస్ నేతలు ఆశ పడుతున్నారు.