ఆంధ్రప్రదేశ్ ఆదాయం లేక కునారిల్లిపోతోంది కానీ.. పొరుగు రాష్ట్రాలకు మాత్రం మేలు చేస్తోంది. పొరుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాల విషయంలో అంచనా వేసిన దాని కంటే ఎక్కువ ఆదాయం లభిస్తోంది. దీనికి కారణం.. ఏపీ మద్యం విధానం. గతేడాదిలో జరిగిన అమ్మకాలను జనవరి నుంచి జూలై వరకు పరిశీలిస్తే ఈ ఏడాది పొరుగురాష్ట్రాలైన తెలంగాణా, కర్నాటకలో భారీగా పెరిగిన అమ్మకాలే దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
ఏపీలో మద్యం ధరలు భారీగా పెరగడమే కాదు… కావాల్సిన బ్రాండ్లు కూడా దొరకడం లేదు. దీంతో ఈ బ్రాండ్ల కోసం మందుబాబులు తెలంగాణ, కర్నాటక వైపు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణాలో జనవరి నుంచి ఆగస్టు వరకూ 2కోట్ల 20లక్షల కేసుల మద్యం అమ్మారు. ప్రభుత్వానికి రూ. 15, 412 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. సరిహద్దు జిల్లాల్లో భారీగా మద్యం అమ్మకాలు పెరగడంతో కనీసం నాలుగు వేల కోట్ల రూపాయలు ఎక్కువ ఆదాయం వచ్చినట్లుగా అంచనా వేస్తున్నారు. కర్నాటకలో 2కోట్ల 95లక్షల 46 వేల మద్యం కేసులు అమ్ముడయ్యాయి. రూ. 13, 458 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. కర్ణాటకలో 4వేల కోట్ల రూపాయలు విలువైన మద్యం విక్రయాలు అదనంగా జరిగాయని అంచనా.
ఇతర రాష్ట్రాల్లో పెరుగుతున్న మద్యం అమ్మకాల వ్యవహారం పరిశీలిస్తే అక్కడి నుంచి ఏపీకి సులువుగానే దిగుమతి అవుతోందని అర్థం చేసుకోవచ్చు. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో మద్యం అక్రమ రవాణాపై దాడులు చేసి స్వాధీనం చేసుకుంటున్నప్పటికీ, కావాల్సిన బ్రాండ్లు తక్కువధరకు లభ్యమవుతుండటంతో మందుబాబులు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్నాటక నుంచి మద్యం కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఆ విధంగా ఏపీకి ఆదాయం తగ్గిపోయినా.. పొరుగు రాష్ట్రాలకు పెరుగుతోంది.