ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ధరలను తగ్గించడానికి మూడు మద్యం కంపెనీలు ముందుకు వచ్చాయి. ప్రముఖ సంస్థల ప్రతిపాదనలకు ఎక్సైజ్ శాఖ ఆమోదం తెలిపి తగ్గించిన ధరలను అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మద్యం షాపుల్లో పాత ధరలతో ఉన్న బాటిళ్లను ఆదే ధరలకే విక్రయించి కొత్తగా వచ్చే వాటికి తగ్గించిన ధరలతో అమ్ముతారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో ప్రముఖ బ్రాండ్ల విక్రయాలకు అవకాశం ఉండేది కాదు. తాజాగా అన్ని బ్రాండ్లను విక్రయించుకోడానికి అనుమతిస్తున్నారు.
మాన్షన్ హౌస్ , రాయల్ చాలెంజ్ సెలెక్ట్ గోల్డ్ విస్కీ , యాంటిక్విటీ విస్కీ ధరలు తగ్గాయి. ఇతర బ్రాండ్ల ధరలను కూడా తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం ధరలపై విమర్శలు రావడంతో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. మద్యం ధరల సవరణపై హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటయింది. అన్ని కంపెనీలతో ధరల సవరణపై ఆ కమిటీ చర్చించనుంది. బాటిల్ తయారీకి ఎంత ఖర్చు అవుతుంది, ప్రభుత్వానికి వచ్చే ఆదాయంతో పాటు వేరే రాష్ట్రాల్లో అమ్ముతున్న ధరలను పరిశీలించనుంది.
కమిటీ నిర్ణయించక ముందే కొన్ని మద్యం కంపెనీలు రేట్లు తగ్గించుకుంటున్నాయి. మరో 2 ప్రముఖ మద్యం ధరలు రెండు మూడు రోజుల్లో తగ్గించనున్నాయి. కమిటీ సిఫార్సుల మేరకు అనుగుణంగా కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం సగం వరకూ తగ్గించింది. గతంలో ఉన్న వైసీపీ నేతల లోకల్ బ్రాండ్ల నుంచి విముక్తి కల్పించింది.