గంగవరం పోర్టు అమ్మేస్తామని అదానీ కంపెనీలకు అధికారికంగా ప్రతిపాదన పెట్టిన ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి ఇళ్లు, ఆఫీసులు, ఎస్టేట్లలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. నిన్న ఉదయం నుంచి జరుగుతున్న ఐటీ సోదాల్లో ఈ రోజు మరింత మంది ఐటీ అధికారులు జత కూడారు. ఇళ్లు, కార్యాలయాలు, ఎస్టేట్లకు తాళాలు వేసి మరీ సోదాలు చేస్తున్నారు. పెద్ద మొత్తంలో నగదు, అనుమానాస్పద లావాదేవీలు దొరకకపోతే.. అదనంగా సిబ్బందిని పిలిపించే అవకాశం లేదని భావిస్తున్నారు.
ఏపీ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడు అయిన ఆయనకు ఇటీవలే ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ పదవి వచ్చింది. ఆ పదవి అందుకున్న తర్వాత గంగవరం పోర్టు అమ్మకం వేగం పుంజుకుంది. అప్పటికే ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నారు. కేవీఆర్ ప్రాజెక్ట్స్ అనే కంపెనీని నిర్వహిస్తున్నారు. అయితే ఐటీ దాడులకు గంగవరం పోర్టు వాటాల అమ్మకాలకు ఏమైనాసంబంధం ఉందో లేదో స్పష్టత లేదు. ఒక్క కాయల వెంకటరెడ్డిపైనే కాకుండా విశాఖలో వైశాఖీ డెవలపర్స్, సర్దార్ ప్రాజెక్ట్స్ యజమానులు అయిన రామకృష్ణ, సాగర్, వెంకన్న చౌదరి ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు చేస్తున్నారు.
సర్దార్ ప్రాజెక్ట్ ఓనర్ వెంకన్న చౌదరి… టీడీపీ నేత గౌతు శిరీష భర్తగా తెలుస్తోంది. బుధవారం కాయల వెంకటరెడ్డితోపాటు వీరి ఇళ్లలోనూ సోదాలు చేశారు. అయితే సోదాలు నిన్ననే ముగిశాయి. మారిటైం బోర్డు చైర్మన్ ఇళ్లు, కార్యాలయాల్లో మాత్రం కొనసాగుతున్నాయి. దీనిపై ఐటీ అధికారులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.