కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొన్న మార్చి 31న రూ. 1800 కోట్లు మంజూరు చేసింది. త్వరలో మరో రూ. 500 కోట్లు విడుదల చేయబోతోందని కేంద్రమంత్రి సుజనా చౌదరి చెప్పారు. అంటే మొత్తం రూ.2300 కోట్లు విడుదల చేసింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ తెదేపా నేతలెవరూ గానీ హర్షం ప్రకటించలేదు. కనీసం ఇంతవరకు దానిపై స్పందించలేదు కూడా. దీని గురించి కేంద్ర మంత్రి సుజనా చౌదరి మొక్కుబడిగా ఒక ప్రకటన చేసి ఊరుకొన్నారు. అంటే ఈ నిధుల విడుదల పట్ల తెదేపా సంతృప్తి చెందలేదని భావించవలసి ఉంటుంది.
దీనిపై రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆర్ధిక శాఖ ముఖ్య అధికారులతో ముఖ్యమంత్రి నిన్న ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. గత ఆర్ధిక సంవత్సరంలో కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఎంత ఇచ్చింది..రెవెన్యూ లోటు భర్తీకి ఇంకా ఎంత ఇవ్వవలసి ఉంది..దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా కేంద్రప్రభుత్వం ఒత్తిడి తేవాలి?అని సమావేశంలో చర్చించారు. రెవెన్యూ లోటు భర్తీ కోసం రాష్ట్రానికి ఇంకా రావలసిన రూ. 13,000 కోట్లను కూడా విడుదల చేయమని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడికి ముఖ్యమంత్రి స్వయంగా ఒక లేఖ వ్రాయాలని, దానికి కేంద్రప్రభుత్వం నుంచి వచ్చే సమాధానాన్ని బట్టి తగిన నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.