ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఇతర వ్యవహారాల సంగతి ఎలా ఉన్నా.. రెండు ముఖ్యమైన అంశాల గురించి కూడా తెలుగు మీడియాలో పరస్పర విరుద్ధ కథనాలే రావడం విశేషం. వీటి సారాంశాన్ని సింపుల్ గా చెప్పాలంటే.. ఒకటి అనుకూలంగా మరోటి వ్యతిరకంగా ఉన్నాయి. రెండు వర్గాల మీడియా ఈ కథనాలను ప్రజంట్ చేసింది. ముందుగా తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటుందనే పేర్గాంచిన ఆంధ్రజ్యోతి లో ఒక కథనం వచ్చింది. దాని సారాంశం ఏమనగా.. సీఎం రిలీఫ్ ఫండ్ పంపకం విషయంలో చంద్రబాబు నాయుడు వితరణ చాటుకుంటున్నాడు అనేది. ఈ విషయంలో బాబు చాలా బాగా వ్యవహరిస్తున్నాడని, అవసరారర్థులకు ఎప్పటికప్పుడు సాయం చేస్తున్నాడనేది ఆ పత్రిక ఇచ్చిన కథనం సారాంశం.
ప్రతి ముఖ్యమంత్రి హయాంలోనూ సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుంది. అభాగ్యులకు, ధీనస్థితిలో ఉన్న అవసరార్థులకు ఈ డబ్బు ద్వారా సాయం చేస్తూ ఉంటారు. అవగాహన ఉన్న గ్రామీణులుకూడా దీని కోసం దరఖాస్తూ చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ సీఎంల హయాంలోనూ ఈ రిలీఫ్ ఫండ్ ఉండింది. దాన్నీ వాళ్లు వారి విచక్షణ మేరకు వినియోగించారు. అయితే వారితో పోలిక పెట్టలేదు, వారు ఎంత ఖర్చు పెట్టారు, బాబు ఎంత ఖర్చు పెట్టారు.. అనే విషయాల్లో గణాంకాల పోలిక ఇవ్వలేదు కానీ.. ఈ ఫండ్ ను ఉపయోగించడంలో బాబు గొప్పగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం అనుకూలమైనదనే పత్రిక పేర్కొంది.
తాజాగా జగన్ కుటుంబానికి చెందిన సాక్షి మీడియాలో ఒక కథనమొచ్చింది. దాని సారాంశం ఏమనగా విజయవాడ సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద అనేక మంది అవసరార్థులకు నిరాశే ఎదురవుతోందనేది. సీఎం అక్కడ ఉంటారు.. తమ గోడును వెల్లబోసుకోవచ్చు, ఏదైనా సాయం పొందవచ్చు అని వచ్చిన అనేక మంది రోజుల తరబడి ఎదురుచూసినా పట్టించుకునే నాథుడు లేడని కథనాన్ని ఇచ్చారు. టీవీలో ప్రసారం అయిన ఈ కథనంలో ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద వేచి ఉన్న జనాలను కూడా చూపారు. వెనుకటికి వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనుదినం క్యాంప్ ఆఫీసు ముందు తన కోసం వేచి ఉన్న జనాలను పలకరించి, వారి గోడును వినే అలవాటు ఉండేదాయనకు. ఆ తర్వాత రోశయ్య, కిరణ్ లు ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టుకోలేదు. ఇక బాబు హయాంలోనూ ఇలాంటి పరిస్థితే ఉందని, క్యాంప్ ఆఫీసు వద్ద కొచ్చిన నిర్భాగ్యులను పట్టించుకునే నాథుడు లేడని ఈ మీడియాలో విశ్లేషించారు. తను డైరెక్ట్ గా సాయం చసే అవకాశం ఉన్న వ్యవహారాల్లో ఏపీ సీఎం చంద్రబాబు గురించి పరస్పరం విరుద్ధంగా వచ్చిన కథనాలు ఇవి!