ప్రజాస్వామ్యాన్ని బ్రతికించేది ప్రజల వాయిస్ ఒక్కటే. ఆ వాయిస్ వినిపించకుండా చేయడానికే ప్రభుత్వాలు అష్టకష్టాలూ పడుతూ ఉంటాయి. ఆ వాయిస్‌ని వినిపించడానికే మీడియావాళ్ళు నానా కష్టాలు పడుతూ ఉంటారు. మీడియానే లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు. చిత్తశుద్ధితో ప్రజాప్రయోజనాల కోసం మీడియా పనిచేసే సమయాల్లో ప్రభుత్వం, పాలకులతో పాటు అన్ని వ్యవస్థలు మీడియాకు భయపడేవి. కనీసం మీడియావాళ్ళకు చేస్తున్న తప్పుల గురించి తెలియకుండా ఉండడానికి ప్రయత్నించేవాళ్ళు. ఆ ఇబ్బందిని కూడా నాయకులు, బడాబడా వ్యాపారస్థలు భరించలేకపోయారు. అందుకే ఆ మీడియాను అడ్డంగా కొనేశారు. తొంభైల తర్వాత నుంచీ సమాజంలో డబ్బు ప్రాధాన్యం బాగా పెరిగిపోయింది. ఆ డబ్బును అడ్డేసి మీడియావాళ్ళను కొనేశారు. 2014 తర్వాత నుంచీ ఎపిలో ఆ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
రైతు రుణమాఫీతో సహా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. మూడేళ్ళ కాలంలో అమరావతిలో ఒక తాత్కాలిక బిల్డింగ్‌ని నిర్మించగలిగారు. ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వేజోన్ల విషయంలో కూడా అంతే తాత్సారం, నిర్లక్ష్యం. ఎన్నికల ప్రచారం సమయంలో ఐదేళ్ళలో అద్భుతాలు చేస్తామన్నవాళ్ళు…మూడేళ్ళ కాలంలో అలాంటి ఒక్క అద్భుతాన్ని కూడా చూపించింది లేదు. మాటలు, గ్రాఫిక్స్‌లో మాత్రం చూపిస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టి ప్రజలను మోసం చేసి ఓట్లేయించుకున్నవాళ్ళు ….గెలిచిన తర్వాత కూడా ఆ మోసాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అంతా మోసం అని చెప్పడానికి నిన్న చంద్రబాబు మాట్లాడిన ఒక్క మాట చాలు. 2004కు ముందు కేంద్రమంత్రిగా ఉన్న దత్తాత్రేయను రైతుల ఆత్మహత్యల గురించి ప్రశ్నిస్తే ….‘తిండి లేక కాదు…తిన్నదరక్క చచ్చిపోతున్నారు’ అని దారుణంగా మాట్లాడేశాడు. ఇప్పుడు చంద్రబాబు కూడా వలసల గురించి అలాగే మాట్లాడుతున్నారు. ఎక్కువ సంపాదన కోసం అమెరికా వెళ్ళే వాళ్ళతో… ఉన్న ఊర్లో బ్రతకలేక నగరాలకు వచ్చి వాచ్‌మెన్‌గా, కూలీలుగా బత్రుకులు ఈడుస్తున్న రైతన్నలతో పోలుస్తున్నాడు. మనవాళ్ళు కమర్షియల్…అందుకే ఎక్కువ డబ్బులొచ్చేపనుల కోసం వలస వెళుతున్నారు అని చెప్తున్నాడు చంద్రబాబు. అంటే బ్రతుకుదెరెవు కోసం వలస వెళ్తున్న వాళ్ళు ఎవరూ లేరన్నమాట.
అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఫ్లైట్స్‌లో, అద్దాల మేడల్లో ఉంటున్న చంద్రబాబుకి రియాలిటీ తెలియకపోవచ్చు. మరో రెండేళ్ళ వరకూ ఆయనకు ప్రజలతో అవసరం కూడా లేకపోవచ్చు. తనకు తోచింది చెప్తూ ఉండవచ్చు. కానీ ప్రజల కోసమే పనిచేస్తున్నాం అని చెప్పి ప్రభుత్వ స్థలాలు, బోలెడన్ని రాయితీలు తీసుకుంటున్న మీడియా బుద్ధి ఏమైంది? మెహర్భానీ కోసం లక్షన్నర కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది చంద్రబాబు ప్రభుత్వం. ప్రపంచంలో ఉన్న అన్ని ప్రభుత్వాల కంటే మా ప్రభుత్వమే ఎక్కువ అభివృద్ధి చేస్తోంది అని చెప్పుకుంది. వలసల్లేవ్. అన్ని కులాల వాళ్ళూ, అన్ని వయసుల ప్రజలూ ఆనందంలో ఓలలాడుతున్నారని చెప్పుకుంది. ఆహా…ఓహో…అద్భుతః అని చంద్రబాబు పొగిడేశాడు.
చంద్రబాబుకు మించిన ఘనులు అనే స్థాయిలో బాబు అనుకూల మీడియా బడ్జెట్ భజన చేసింది. రాష్ట్రం దూసుకెళుతోంది. ప్రజలందరి జీవితం పండగలా ఉంది అని రాసేసింది. ఇక ప్యాకేజీ గురించి కూడా చంద్రబాబు కంటే టిడిపి అనుకూల మీడియానే ఎక్కువ పొగిడేసింది. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ ఎన్నో రెట్లు గొప్ప అని రాసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబుకంటే ముందు చంద్రబాబు అనుకూల మీడియాకే ప్రజలు బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చేసినట్టే కనిపిస్తోంది. జగన్ విషయంలో, చంద్రబాబు రాజకీయాల విషయంలో వాళ్ళిష్టమొచ్చినట్టు రాసుకోవచ్చు కానీ ప్రజల కష్టాల గురించి, ప్రజల జీవితాల గురించి రాసేటప్పుడు కూడా రాజకీయ నాయకుల్లాగే అబద్ధాలు, మోసపు మాటలతో ప్రజలను మాయచేయాలనుకునే మీడియా ఆ ప్రజలకు అవసరమా?