ఆంధ్రప్రదేశ్ మంత్రి జయరాం కుమారుడు ఈశ్వర్ తన పుట్టిన రోజైన డిసెంబర్ 12వ తేదీన పన్నులతో కలిపి రూ. కోటి ఇరవై లక్షల వరకూ విలువ చేసే ఖరీదైన బెంజ్ కారును అందుకున్నారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో తనే స్వయంగా పంచుకున్నారు. ఆ ఒక్క ఫోటోనే కాదు. ఆయన ఆ కారుతో… కర్నూలు జిల్లాలో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఆ కారుతో జల్సా డ్రైవింగ్ చేస్తూ… ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ మురిసిపోవడం ఆయన ప్రత్యేకత. ఈ వీడియోలన్నీ వైరల్ అయ్యాయి. ఇవన్నీ కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి. కానీ మంత్రి జయరాం మాత్రం… ఆ కారు ముందు తన కుమారుడు ఫోటో మాత్రమే దిగారంటున్నారు.
ఆ కారు తన కుమారుడిదని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ కూడా చేస్తున్నారు. అంతే కాదు.. ఆ కారును లంచంగా తీసుకున్నారని ఆరోపించిన వారిని మతిస్థిమితం లేని వారిగా తేల్చేస్తున్నారు. అడ్డంగా దొరికిన తర్వాత కూడా.. ఇలా వాదించడం రాజకీయ నేతలకు మాత్రమే సాధ్యం. అదీ కూడా అధికారంలో ఉన్న వారికి ఇంకా ఇంకా సాధ్యం. కావాలంటే… అలా ఆరోపించి .. సాక్ష్యాలు బయట పెట్టిన నేతలకు.. నిజంగానే పిచ్చి అని ముద్ర వేసి ఆస్పత్రులకు తరలించగలిగిన సామర్థ్యం ప్రస్తుత ప్రభుత్వానికి ఉందని ఎన్నో సార్లు నిరూపితమయింది. అయితే.. ప్రజలనే మరీ తక్కువగా అంచనా వేస్తున్నారు మంత్రిగారు. ఆ కారే కాదు.. పేకాట క్లబ్బులు… భూముల కబ్జాలు .. అన్నీ కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నా… ఎదురుదాడి చేస్తూ.. ప్రజలు నమ్మేస్తారని.. వారికి తాము చెప్పేది తప్ప.. అసలు నిజాలు తెలుసుకునే జ్ఞానం లేదని అనుకుంటున్నారు.
ఈ విషయంలో ఒక్క గుమ్మనూరు జయరాం మాత్రమే కాదు.. వైసీపీలో చాలా మంది పీహెచ్డీలు చేశారు. ఎమ్మెల్యే గోడౌన్లో గుట్కా తయారీ చేస్తూ అడ్డంగా దొరికారు. ఆయన బంధువులు కూడా దొరికారు. కానీ చివరికి కేసులో ఎవరినో ఇరికించారు. ఆ ఎమ్మెల్యే కూడా.. తన తప్పు ఉంటే నిరూపించాలని సవాల్ చేశారు. ఇక చెన్నై సరిహద్దులో పట్టుబడిన ఐదు కోట్ల కథ కూడా అంతే. అడ్డంగా దొరికిన తర్వాత నిలువుగా వాదిస్తూ.. ప్రజలు తాము ఏం చెప్పినా నమ్మేస్తారని… వారు భావిస్తున్నారు. అధికారంలో ఉన్నాం కాబట్టి.. తమకు లైసెన్స్ ఉన్నట్లుగా భావిస్తున్నారు. కానీ ప్రజల్నే తక్కువ అంచనా వేస్తున్నారు.