తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొండ పోచమ్మ సాగర్‌లో పనులు చేసిన ఏపీ మంత్రి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఆ ప్రాజెక్ట్ నుంచి సంగారెడ్డిని నీటిని విడుదల చేసేందుకు గేట్లు నిర్మించారు. ఆ గేట్ల వద్దకు వెళ్లేందుకు ఓ వంతెన నిర్మించారు. ఆ ప్రాజెక్టులోకి కాస్త నీరు చేరగానే.. ఆ వంతెన కూలిపోయింది. దాంతో.. అధికారులు ఉలిక్కి పడ్డారు. కేసీఆర్ ఆ ప్రాజెక్టును చాలా ఆర్భాటంగా ప్రారంభించారు. దానికి కారణం ఆ ప్రాంతాన్ని పర్యాటక పరంగా అభివృద్ధి చేయాలనుకున్నారు. దానికి తగ్గట్లుగానే పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు. వంతెన కూలిన విషయం తెలిసిన వెంటనే.. అధికారులు పర్యాటకుల్ని నిలిపివేశారు. అటు వైపు ఎవరూ వెళ్లకుండాపెద్ద ఎత్తున పోలీసు బలగాల్ని మోహరింప చేశారు.
ఆ ప్రాజెక్ట్‌ను కాంట్రాక్ట్ తీసుకుని నిర్మించిన కాంట్రాక్టర్‌ను పిలిపించి.. యుద్ధ ప్రాతిపదికన మళ్లీ ఆ వంతెన కట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం కాంట్రాక్టర్ కూలిపోయిన వంతెనను మళ్లీ కట్టే పనులు ప్రారంభించారు. ఇంతకీ ఆ కాంట్రాక్టర్ ఎవరు అంటే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రి అని.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఈ వంతెన కట్టింది ఒక ఏపి మంత్రికి చెందిన కంపెనీ అని, ఆ ఏపీ మంత్రి నిర్వాకం బయట పడకుండా, కేసీఆర్ పోలీసులని పెట్టి, దాచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ, కొన్ని ఫోటోలు, వీడియోలు తన ట్విట్టర్ లో వదిలారు. తెలంగాణలో., ముఖ్యంగా ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున వైసీపీ నేతలు … కాంట్రాక్టులు చేస్తున్నారు.
కొండ పోచమ్మ సాగర్ నిర్మాణ నాణ్యతపై కొద్ది రోజులుగా అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ నెలలోనే కాస్త ఎక్కువ వరద రావడంతో రిజర్వాయర్ కాలువకు గండి పడి ఉళ్లు మునిగిపోయాయి. దాదాపు రూ.1,600 కోట్ల వ్యయంతో కొండ పోచమ్మ ప్రాజెక్టు చేపట్టారు. నాలుగేళ్లలోనే 15 టీఎంసీల సామర్థ్యంతో కొండ పోచమ్మ రిజర్వాయర్‌ను నిర్మించారు. కాంట్రాక్టర్ పనులను నాసిరకంగా చేయడంతో ప్రభుత్వం అనేక విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది.