జనవరి 1వ తేదీన చంద్రబాబు నాయుడు జనసేన కి తాను వ్యతిరేకం కాదని అన్నట్లుగా మాట్లాడి, రాష్ట్ర ప్రయోజనాల కోసం మోడీ పై పోరాటానికి కలిసిరావాలని పవన్ కళ్యాణ్ కి పిలుపు ఇచ్చారు. దీంతో తెలుగుదేశం పార్టీ మళ్లీ జనసేన తో పొత్తు కోసం ప్రయత్నిస్తోంది అన్న చర్చ విస్తృతంగా జరిగింది. దీనిపై పవన్ కళ్యాణ్ స్పష్టమైన ప్రకటన చేసి, కేవలం వామపక్షాలతో తప్ప తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని చెప్పిన తర్వాత కూడా టీడీపీ నేతలకు ఇంకా ఆశ తీరినట్లు గా కనిపించడం లేదు. ఇవాళ మంత్రి నారాయణ వ్యాఖ్యలు కూడా జనసేన ను పొత్తు కోసం ఆహ్వానిస్తున్నట్లు గానే ఉన్నాయి.
మంత్రి నారాయణ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ నిజ నిర్ధారణ కమిటీ వేసి రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన లెక్క దాదాపు 75 వేల కోట్లు అని నిర్ధారించారు అని, అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీపై మౌనం దాల్చడం సమంజసం కాదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం బిజెపితో పోరాడుతున్న పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే కాబట్టి, పవన్ కళ్యాణ్ కూడా తమతో కలిసి రావాలని ఆహ్వానిస్తున్నామని వ్యాఖ్యానించారు. అయితే కలిసి వచ్చేది లేనిది పవన్ కళ్యాణ్ ఇష్టం అని ఆయన ముక్తాయించారు.
ఏది ఏమైనా టిడిపి నేతల జనసేనని ఆహ్వానిస్తున్న వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ టీడీపీ తో పొత్తు తనకు ఇష్టం లేదని చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే, జనసేన తో పొత్తు పెట్టుకోవాలని టిడిపి ఆరాటపడుతోంది అని అర్థం అవుతోంది. దీని ద్వారా టిడిపి పార్టీ సొంతంగా గెలవ లేదేమోనన్న సంకేతాలను తెలుగుదేశం నేతలు తమకు తెలియకుండానే ప్రజల్లోకి పంపిస్తున్నారు. మరి అది పార్టీకి ఏ మేరకు నష్టం కలిగిస్తుంది అన్నది తెలియాలంటే ఎన్నికల దాకా వేచి చూడాల్సిందే.