ఏపీ మంత్రి పినిపే విశ్వరూప్ ఆరోగ్యం క్షీణించడంతో ముంబై తరలించారు. వైఎస్ఆర్ వర్థంతి రోజున ఆయన బ్రెయిన్ స్ట్రోక్‌కు గురి కావడంతో కాకినాడలో చికిత్స చేసి హైదరాబాద్‌కు తరలించారు. అయితే మంత్రులంతా సహజంగా అయితే అపోలో ఆస్పత్రికి లేకపోతే ఏఐజీ ఆస్పత్రిలో చేరుతారు. కానీ ఆయనను సిటీ న్యూరో ఆస్పత్రిలో చేర్పించారు. అదేమీ పెద్ద కార్పొరేట్ ఆస్పత్రి కాదు. లోటస్ పాండ్‌కు వెళ్లే దారిలో ఓ చిన్న భవనంలో ఉంటుంది. ఆ ఆస్పత్రిలోనే జగన్ కోడికత్తి గాయానికి చాలా రోజుల పాటు వైద్యం చేయించుకున్నారు.
ఆ ఆస్పత్రి పెద్ద డాక్టర్ కం యజమానికి.. ఏపీలో ప్రభుత్వం రాగానే వైద్య రంగానికి సంబంధించిన మంచి నామినేటెడ్ పోస్టు కూడా ఇచ్చారు. అయితే ఇప్పటి వరకూ ఏపీ ప్రభుత్వానికి చెందిన ముఖ్యులెవరూ ఆ ఆస్పత్రిలో చేరలేదు. కానీ పినిపె విశ్వరూప్‌ను అక్కడికే పంపించారు. ఆయనకు చాలా చిన్న అనారోగ్యమేనని నయమైపోయిందని తర్వాత ఆస్పత్రి ప్రకటన చేసింది. ఆయనను ఇంటికి పంపేశారని చెప్పుకున్నారు.
కానీ ఇటీవల కేబినెట్ సమావేశాలు.. అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కాలేదు. ఆరోగ్యం రోజు రోజుకూ దిగజారిపోతూండటంతో నిపుణుల సలహా మేరకు ముంబై తరలించారు. ఆయనకు వచ్చిన అనారోగ్యం ఏమిటన్నదానిపై పూర్తి విరవాలు బయటకు తెలియనివ్వలేదు. ముంబై తరలించిన విషయం కూడా ఆలస్యంగానే వెలుగులోకి వచ్చింది.