మంత్రి వర్గం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సూపర్ కమాండ్ ఉంటుందని అంటారు! ఆయన ఎంత చెబితే అంత… సీఎం మాట జవదాటరు అనే ప్రచారం కూడా ఉంది. ఇక, టీడీపీ గురించి ఆయన ఎప్పుడూ చెప్పేమాట… ‘అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ మాది’ అని! అయితే… ఇలా మాటల్లో ధ్వనిస్తున్న క్రమశిక్షణ వాస్తవంలో ఉందా లేదా అనేది కొన్ని సందర్భాల్లో బయటపడుతుంది. అలాంటి తాజా సందర్భం… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమెరికా టూర్!
ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు ఇతర మంత్రి వర్గం ఎంతో బాధ్యతాయుతంగా ఉండాలి కదా! కానీ, ఏపీ మంత్రులు అలా ఉండటం లేదంటూ కొన్ని కథనాలు మీడియాలో వస్తున్నాయి! చంద్రబాబు రాష్ట్రంలో లేకపోయేసరికి మంత్రులు హాలీడే మోడ్ లో ఉన్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. బాస్ లేనప్పుడు ప్రభుత్వోద్యోగులు ఏవిధంగా అయితే రిలాక్స్ అయిపోతారో… సీఎం లేకపోయేసరికి మంత్రులు కూడా అదే పనిలో ఉన్నారని సమాచారం. నిజానికి, ప్రతీ సోమ, గురువారాలు మంత్రులు విధిగా సచివాలయానికి రావాలంటూ సీఎం ఆదేశాలున్నాయి. వారంలో ఆ రెండు రోజులూ ప్రజల కష్టాలను వినాలి, వినతలు స్వీకరించాలి. అంతేకాదు… అలా స్వీకరించిన వినతులపై అయ్యేసరికి ముఖ్యమంత్రికి ఒక నివేదిక కూడా ఇవ్వాలి. ఇది రెగ్యులర్ గా తప్పనిసరిగా జరగాలని మంత్రులతో చంద్రబాబు నేరుగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ, వీటిని ఆమాత్యులు బేఖాతరులు చేస్తున్నారట.
ముఖ్యమంత్రి లేకపోయేసరికి సచివాలయానికి హాజరయ్యే మంత్రుల సంఖ్య చాలా తక్కువగా ఉంటోందట! మంత్రులే ఇలా ఉంటే.. ఇక ఆయా శాఖల అధికారుల అటెండెన్స్ గురించి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే, అక్కడ వారానికి ఐదు రోజులే పనిదినాలు. శుక్రవారం ఉదయం నుంచే హాలీడే ఫీల్ వచ్చేస్తోందట! ఆరోజు మధ్యాహ్నం నుంచే హైదరాబాద్ కి వెళ్లడమే పనిగా మారిపోతోంది. ఆమాత్యులే ఆ తీరుగా ఉంటే, ఉద్యోగులు ఇలానే ఉండటంలో ఆశ్చర్యం ఏముంటుందనేవారూ ఉన్నారు.
సో.. మంత్రుల క్రమశిక్షణ ఈ రేంజిలో ఉందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి వర్గంపై చంద్రబాబు హూంకరింపూలూ సుప్రీమ్ కమాండింగ్ ప్రభావం ఇంతేనా అనుమానం కలుగుతోంది. నిజానికి, ఆ మధ్య మంత్రి వర్గ విస్తరణ సందర్భంగానే టీడీపీ నేతల తీరు బయటపడింది! రాజీనామాలు చేస్తామనీ, పార్టీని వీడిపోతామనీ కొంతమంది బయటపడిపోయారు. మరి, చంద్రబాబు మాట జవదాటనంత క్రమశిక్షణ ఉంటే అలా ఎందుకు మాట తూలతారు..? ఇప్పుడు ఇలా ఎందుకు హాలీడే ఫీల్ అవుతారు..? ఇంతకీ… మంత్రులు ఇలా రిలాక్స్ అయిపోతే యువరాజు ఏం చేస్తున్నట్టు..?