హైదరాబాద్: గుంటూరు జిల్లా వెలగపూడిలో ఇవాళ శంకుస్థాపన జరిగిన తాత్కాలిక సచివాలయంపై ప్రతిపక్షాల ఆరోపణలకు, ప్రజలలో నెలకొన్న అయోమయానికి ఏపీ మంత్రి నారాయణ వివరణ ఇచ్చారు. ఒకవైపు వేలకోట్లతో రాజధాని నిర్మిస్తూ రెండళ్ళ సమయంకోసం తాత్కాలిక సచివాలయం ఎందుకని, తాత్కాలిక భవనానికి రు.210 కోట్లు వృథా చేస్తున్నారని విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి ఒక న్యూస్ ఛానల్లో స్పందించారు. వెలగపూడిలో కట్టేది రేకుల షెడ్డులో మరొకటో అన్నట్లుగా ప్రచారం చేసి ప్రభుత్వ ధనాన్ని వృథా చేస్తున్నామనే భావనను ప్రజలలో చొప్పిస్తున్నారని, వెలగపూడిలో కట్టేది శాశ్వత భవనాలని చెప్పారు. హైదరాబాద్ నుంచి వచ్చే ప్రభుత్వోద్యోగులు ఈ భవనాలలో రెండేళ్ళపాటు తాత్కాలికంగా పనిచేస్తారని తెలిపారు. కోర్ క్యాపిటల్‌లో శాశ్వత భవనాలు కట్టిన తర్వాత సచివాలయం అక్కడకు షిఫ్ట్ అవుతుందని చెప్పారు. అప్పుడు ఈ భవనాలను కమర్షియల్ అవసరాలకు గానీ, కన్వెన్షన్ సెంటర్లకు గానీ, ఆఫీసులకు గానీ, సాఫ్ట్ వేర్ ఆఫీసులకు గానీ లీజుకు ఇస్తామని తెలిపారు. ఒక్క రూపాయి కూడా వృథా కాబోదని నారాయణ అన్నారు.
తాత్కాలిక సచివాలయంకోసం ఇప్పుడు నిర్మిస్తున్న భవనం కూడా మాస్టర్ ప్లాన్‌లోనే ఉందని, దీనిని మల్టీపర్పస్ బిల్డింగ్‌గా ప్లాన్‌లో పేర్కొన్నారని చెప్పారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా రాజధాని నిర్మాణంకోసం సేకరించిన 217 చ.కి.మీ.లలో రోడ్లు, డ్రైనేజి వ్యవస్థ, సివరేజి లైన్స్, స్ట్రీట్ లైన్స్, స్టార్మ్ వాటర్ మొదలైన వాటితోబాటు నివాస గృహాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, ఆఫీసులు, స్కూల్స్, హాస్పిటల్స్‌ను కూడా సీఆర్డీఏ నిర్మించాల్సి ఉందని తెలిపారు. ఈ మల్టీ పర్పస్ బిల్డింగ్‌ను కూడా దానిలో భాగంగానే సీఆర్డీఏ నిర్మించాల్సిఉందని చెప్పారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇవాళ శంకుస్థాపన జరిగిన ప్రదేశంలో 24 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణం అందుబాటులోకొచ్చేటట్లు జీ ప్లస్ 8 తరహాలో భవనాన్ని నిర్మించాల్సిఉందని వెల్లడించారు. మొదట జీ ప్లస్ 2 పూర్తి చేసి అక్కడ లభ్యమయ్యే 6 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంలో సచివాలయాన్ని, అసెంబ్లీని ఇక్కడ ఏర్పాటు చేస్తామని నారాయణ తెలిపారు.
ఈ తాత్కాలిక సచివాలయ నిర్మాణఖర్చు గురించి కూడా నారాయణ వివరణ ఇచ్చారు. బయట చదరపుటడుగుకు రు.3,000 ఉన్నమాట నిజమేనని, అయితే నాలుగునెలల అతితక్కువ కాలంలోనే నిర్మిస్తున్నందువల్లే రు.350 ఎక్కువ ఇస్తున్నామని చెప్పారు.