ఆంధ్రప్రదేశ్ మంత్రులు… పరిపాలనకు అలవాటు పడలేకపోతున్నారు. తమకు కేటాయించిన శాఖల్లో.. అధికారులపై.. వ్యవహారాలపై పట్టు సాధించడానికే నానా తంటాలు పడుతున్నారు. అత్యంత కీలకమైన సమావేశాలకు కూడా.. అధికారులు రాకుండా.. చుక్కలు చూపిస్తున్నారు. మీడియా అటెన్షన్ ఉంటుందని తెలిసి కూడా.. కొన్ని సమావేశాలకు కావాలనే డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. శుక్రవారం… ఏపీ విద్యారంగంలో పెట్టుబడులు పెడతామంటూ… ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం వచ్చింది. ఆ బృందం.. మంత్రి ఆదిమూలపు సురేష్తో సమావేశమైంది… కానీ మంత్రి వద్ద కనీస సమాచారం లేదు. ఒక్క అధికారీ భేటీకి రాలేదు. దాంతో.. మంత్రికి ఆస్ట్రేలియా బృందంతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు.
ఈ కోపం అంతా.. తనకు ప్రభుత్వం ఓఎస్డీగా నియమించిన శ్రీనివాసరెడ్డి అనే అధికారిపై చూపించారు. ఎజెండా ఏదీ..? సమాచారం ఎక్కడ..? అధికారులు ఏమయ్యారని… అసహనం వ్యక్తం చేశారు. విదేశీ ప్రతినిధులతో మీటింగ్ ఉన్నప్పుడు వారిని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తోపాటు ఇతర ఉన్నతాధికారులు మంత్రి వద్దకు తీసుకురావాలి. ఆ ప్రతినిధి బృందంతో అసలేం మాట్లాడాలి అనే అంశంపై ఒక ఎజెండా ప్రిపేర్ చేయాలి.. ముందుగా అసలు విషయం ఏమిటో మంత్రికి చెప్పాలి. అసలు ఏమీ చెప్పకుండా.. నేరుగా మీటింగ్ ఏర్పాటు చేసేశారు. కనీస సమాచారం లేకుండా నేను వాళ్లతో ఏం మాట్లాడాలనేది మంత్రి సురేష్ ఆవేదన. ఎంత సేపు ఎదురు చూసినా.. అధికారులు మాత్రం రాలేదు. దాంతో… అసలు ఎందుకొచ్చారో ఆ విషయం మాట్లాడకుండా.. మిగతా పిచ్చాపాటి కబుర్లు చెప్పి.. సమావేశం ముగిసిందనిపించారు.
విదేశాల నుంచి వస్తున్న ప్రతినిధి బృందం ఇటువంటి సమన్వయలోపంతో మంత్రికి చేదు అనుభవం ఎదురవ్వడంతో అక్కడున్న మీడియా, ఇతర అధికారులు అవాక్కయ్యారు. చివరకు మంత్రి ఎలాకొలా మేనేజ్ చేయటంతో డెలిగేట్స్ తో మీటింగ్ అయ్యిందని అనిపించారు. మీటింగ్ ముగిసిన తర్వాత కూడా ఎందుకిలా జరిగిందంటూ.. ఓఎస్డీపై మండిపడ్డారు. అయితే.. అసలు విషయం మాత్రం.. మంత్రులు పాలనపై పట్టు సాధించలేకపోతున్నారని అంటున్నారు. ఉన్నతాధికారులు… మొత్తం.. మంత్రులకు రిపోర్ట్ చేయడం కన్నా.. నేరుగా.. పెద్దలకు రిపోర్ట్ చేసుకుంటనే తమకు ఫ్యూచర్ ఉంటుందన్న రీతిలో ఉంటున్నారంటున్నారు. మంత్రులకు నిరాదరణ ఎదురు కావడానికి ఇది కూడా ఓ కారణమన్న భావన ఏర్పడుతోంది.