శాసనమండలి రద్దు తీర్మానం ఆమోదించిన వెంటనే.. జగన్మోహన్ రెడ్డి .. నైతిక పరంగా విమర్శలు రాకుండా ఉండటానికి.. ఇద్దరు మంత్రులతో రాజీనామా చేయించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రివర్గంలో.. పిల్లిసుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్సీలు. వీరికి గత ఎన్నికల్లో.. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చినప్పటికీ.. విజయం సాధించలేకపోయారు. అయినప్పటికీ.. వెన్నంటే ఉన్నారన్న కారణంగా.. మంత్రి పదవులను జగన్ ఇచ్చారు. వీరిలో సుభాష్ చంద్రబోస్.. ముందు నుంచీ ఎమ్మెల్సీగా ఉన్నారు. మోపిదేవిని.. మంత్రి పదవి అప్పగించిన తర్వాత శాసనమండలికి పంపించారు. ఎనిమిది నెలల కాలంలోనే వీరి మంత్రి పదవులకు గండం వచ్చి పడింది. నిజానికి శాసనమండలి అధికారికంగా రద్దయ్యే వరకూ.. వీరు మంత్రి పదవుల్లో కొనసాగడానికి అవకాశం ఉంది.
అసెంబ్లీ తీర్మానాన్ని లోక్సభ, రాజ్యసభలు ఆమోదించి.. రాష్ట్రపతి నోటిఫికేషన్ ఆమోద ముద్ర వేసే వరకూ.. మండలి ఉనికిలో ఉంటుంది. కానీ స్వయంగా.. ప్రభుత్వమే.. మండలిని రద్దు చేయాలని తీర్మానం చేసిన తర్వాత.. ఆ మండలిలో సభ్యులను మంత్రులుగా కొనసాగించడం కరెక్ట్ కాదని.. జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీలో ..తీర్మానం ఆమోదించిన వెంటనే.. మంత్రులు రాజీనామా చేయాలని.. జగన్.. మంత్రివర్గ సమావేశంలో సూచించినట్లుగా చెబుతున్నారు. ఈ మేరకు వారు రాజీనామా చేయడం లాంఛనమే. మండలి రద్దును తాము స్వాగతిస్తున్నామంమటూ.. మంత్రులు స్వయంగా మండలిలో ప్రకటించారు కూడా.
అధికారికంగా ఈ విషయం బయటకు తెలియకపోయినప్పటికీ.. టీడీపీ నేత నారా లోకేష్ మాత్రం.. మండలిని రద్దు చేయాలని నిర్ణయించుకున్నందున.. మంత్రులతో పాటు.. మండలిలో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. మండలి రద్దయ్యేలోపు జరగబోయే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనకూడదని.. డిమాండ్ చేశారు.