సాధారణంగా.. పరిపాలనా సౌలభ్యం కోసమే కదా వివిధ శాఖల్ని మంత్రులకు అప్పగిస్తారు! అంటే, ఆయా శాఖలకు చెందిన పనులన్నీ మంత్రులే చూసుకోవాలి. వారే స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలి. మంత్రులు చెబితే జరగని పని అంటూ ఏదైనా ఉంటుందా అని అనుకుంటాం! కానీ, ఏపీలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందంటూ చాలారోజుల నుంచీ విమర్శలున్న సంగతి తెలిసిందే. ఇతర శాఖల్లో ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ జోక్యం అధికంగా ఉంటోందన్న ఆరోపణలూ విన్నాం. ఇతర శాఖల ఫిర్యాదులూ సమస్యలూ కూడా లోకేష్ ఛాంబర్ కు చేరుతున్న వైనాన్ని చూశాం. ఏ శాఖలో ఏ పని కావాలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు, లేదా మంత్రి లోకేష్ బాబు చెప్తేగానీ జరగవనే పరిస్థితి ఉందంటూ ఆరోపణలు కూడా ఉన్నాయి. అధికారులు కూడా మంత్రులు చెబితే పెద్దగా పట్టించుకోరనీ, అంతిమంగా ఆ ఇద్దరిలో ఎవరో ఒకరి నుంచి ఆదేశాల కోసం ఎదురుచూస్తారనే విమర్శలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి పత్తిపాటి పుల్లారావుకు ఓ అనుభవం ఎదురైంది..!
తన బంధువుకు సంబంధించిన ఓ పనికోసం ఓ రికమండేషన్ లెటర్ ఇచ్చి మంత్రి పుల్లారావు పంపించారు. కానీ, ఆ సిఫార్సు లేఖను టీటీడీ అధికారులు పెద్దగా పట్టించుకోలేదట. దాంతో సీఎం కార్యాలయ సిబ్బందితో మంత్రి ఫోన్ చేయించారట. అయినాసరే, ఆ లెటర్ ను రిజెక్ట్ చేస్తున్నట్టుగా చెప్పేసి, ఉత్తరాన్ని వెనక్కి పంపించినట్టు సమాచారం. తాను స్వయంగా లేఖ ఇచ్చినా పని కాకపోవడమేంటీ అంటూ మంత్రి పుల్లారావు ఆఫ్ ద రికార్డ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. ఇదొక్కటే కాదు, సొంత నియోజక వర్గంలో పార్టీ ఆఫీసు విషయంలో కూడా పుల్లారావుకు ఇలాంటి అనుభవమే ఎదురైందని చెబుతున్నారు. ఆఫీస్ కోసం ఓ స్థలాన్ని చూసి, దానికి సంబంధించిన ఫైలును సిద్ధం చేసి, మంత్రి ఉమాతో చర్చించి అంతా ఓకే చేయించుకున్నారట. అయితే, ఈ ఫైలు విషయమై అధికారులు స్పందిచకుండా కామ్ గా ఉండిపోవడంతో.. మంత్రి షాక్ తినాల్సి వచ్చిందట! ఎవరితో చెప్పించాలో తెలియక, చివరికి సీఎంకు ఫిర్యాదు చేసిన అనుభవమూ మంత్రి పత్తిపాటికి ఉందని చెబుతున్నారు.
ఏతావాతా మంత్రివర్యులకు అర్థమౌతున్నది ఏంటంటే… ఏ పని కావాలన్నా ముఖ్యమంత్రి చెప్పాలి, లేదా చినబాబు లోకేష్ తో చెప్పించుకోవాలి! వారు చెబితేనే అధికారులు వింటారు, పనులు జరుగుతాయి! ఒక్క పుల్లారావు మాత్రమే కాదు.. ఇతర శాఖలకు సంబంధించిన విషయాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని టీడీపీ వర్గాల్లోనే గుసగుసలాడుతున్నారు. కొన్ని శాఖల్లో ఆ మంత్రులతో నిమిత్తం లేకుండా.. సెక్రటరీలు, పీఆర్వోలతో చర్చించేసి వారే నిర్ణయాలు తీసుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయంటూ కథనాలు వినిపిస్తున్నాయి. తనకు ఎదురైన ఈ అనుభవాలపై మంత్రి పుల్లారావు సన్నిహితుల ముందు వాపోతున్నారట! మంత్రిగారు ఇలా పెదవి విరుస్తున్నారంటూ అధినాయకత్వానికి తెలిస్తే.. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు!