ఏపి రాజధాని అమరావతి నిర్మాణం ఇంకా ఎప్పుడు మొదలవుతుందో తెలియదు గానీ అది తెదేపా, వైకాపాలకు రణభూమిగా ఉపయోగపడుతోంది. తెదేపాకి చెందినా మంత్రులు, నేతలు, ప్రజా ప్రతినిధులు రాజధాని ప్రాంతంలో వేలాది ఎకరాల భూమిని తమ బినామీ పేర్లతో కొనుగోళ్ళు చేసారని ఆరోపిస్తూ ఆ వివరాలతో సహా వైకాపా మనసాక్షి వంటి సాక్షి మీడియాలో వరుస కధనాలు రావడంతో తెదేపా, వైకాపా నేతల మధ్య యుద్ధం మొదలయింది.
తెదేపా నేతలు సాక్షిలో వచ్చిన కధనాలని ఖండిస్తూనే ఉన్నారు. కానీ సాక్షిలో ఇంకా మంత్రులకి వ్యతిరేకంగా కధనాలు వస్తూనే ఉన్నాయి. వాటిని తెదేపా నేతలు ఇంకా గట్టిగా ఖండిస్తూనే ఉన్నారు…వైకాపా నేతలు ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ యుద్ధం వలన తెదేపా, ప్రభుత్వ ప్రతిష్టలు చాలా దెబ్బతింటున్నాయి. రావెల కిషోర్, పయ్యావుల కేశవ్, వేమూరి రవికుమార్ తదితరులు రాజధానిలో భూములు కొన్నట్లు తెదేపా నేతలే స్వయంగా చెప్పుకోవడంతో సాక్షి, వైకాపా చేస్తున్న ఆరోపణలు నిజమని ప్రజలు కూడా అనుమానించే పరిస్థితి కల్పించుకొన్నారు.
ఈ వ్యవహారంపై ఇంతవరకు ఆత్మరక్షణకే పరిమితమయిన తెదేపా నేతలు ఇప్పుడు వైకాపాపై యుద్ధానికి సిద్దం అయినట్లున్నారు. తమ పరువు ప్రతిష్టలకి భంగం కలిగించే విధంగా సాక్షి మీడియాలో అసత్య, ఆధారరహితమయిన కధనాలు ప్రచురించినందుకు మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి. నారాయణ సాక్షి మీడియాకి నిన్న లీగల్ నోటీసులు పంపించారు. తమపై నిరాధారమయిన ఆరోపణలు చేసినందుకు ఆ పత్రిక బేషరతుగా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని లేకుంటే కోర్టులో పరువు నష్టం దావా ఎదుర్కోవడానికి సిద్దం కావాలని నోటీసులలో పేర్కొన్నారు. దీనిపై సాక్షి ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.
అది తన వద్ద బలమయిన ఆధారాలున్నట్లు ప్రకటించింది కనుక న్యాయస్థానానికి వెళ్లేందుకే మ్రోగ్గు చూపవచ్చును. ఒకవేళ ఈ కేసులో రాష్ట్ర స్థాయిలో ఓడిపోయినా, దానిపై సుప్రీం కోర్టు వరకు వెళ్లి సాగదీసే వీలుంటుంది. కానీ దీని గురించి ‘రాజధాని భూముల కుంభకోణం కేసు’ అనే హెడ్డింగ్ తో రాష్ట్ర, జాతీయ స్థాయి మీడియాలో వచ్చే వార్తలలో ఏపి మంత్రుల పేర్లు కూడా కనబడుతుంటే దాని వలన తెదేపాకి, తెదేపా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కూడా చాలా అప్రదిష్ట కలగవచ్చును. పైగా ఆంధ్రాలో మీడియా అణచివేతకు గురవుతోందనే ప్రచారం అవుతుంది. కనుక ఈ వ్యవహారంలో మంత్రులతో న్యాయ పోరాటానికే సాక్షి సిద్దపడవచ్చును.
ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్ గుంటూరు సమీపంలోగల ‘హాయ్ ల్యాండ్’ ని చేజిక్కించుకొని అవినీతికి పాల్పడ్డారని సాక్షి మీడియా ఆరోపించింది. కానీ ఆయన ఈ కారణంగానే సాక్షికి లీగల్ నోటీసులు పంపకపోవచ్చును. ఒకవేళ పంపినట్లయితే కోర్టులో ఈ కేసు సాగుతున్నంత కాలం మీడియాలో “ముఖ్యమంత్రి కొడుకు హాయ్ ల్యాండ్ కేసు” అనే హెడ్డింగుతో వార్తలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ భవిష్య పరిణామాల గురించి ఆలోచిస్తే తెదేపా, వైకాపాలలో ఏది తప్పటడుగు వేసింది?అనే సందేహం కలగడం సహజం. దానికి కాలమే జవాబు చెపుతుంది.