ఏపీ మంత్రులు మాజీలు కాబోతున్నారు. ఒకరిద్దరిని కొనసాగించి మిగతా వారిని తొలగించబోతున్నారు. ఈ క్రమంలో మంత్రుల మాటల్లో మార్పు వస్తోంది. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కొద్ది రోజులుగా సైలెంట్‌గా ఉంటున్నారు. మరికొందరిదీ అదే బాట. ఇంకొంత మంది అయితే గతంలో విచ్చలవిడిగా బూతులతో దాడి చేసి ఇప్పుడు విజ్ఞతగురించి మాట్లాడటం ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా మంత్రి ధర్మాన కృష్ణదాసుకు మధ్యలో డిప్యూటీసీఎం హోదా ఇచ్చారు. ఇప్పుడు ఆ హోదాతో పాటు మంత్రి పదవి కూడా పీకేయడం ఖాయంగా కనిపిస్తోంది.
కృష్ణదాసు ఎలా బూతులతో విరుచుకపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అమరావతి రైతుల్ని అత్యంత దారుణంగాతిట్టారు. చంద్రబాబునుకూడా ఎన్ని సార్లు దారుణంగా తిట్టారో లెక్క లేదు. ఇప్పుడు పదవి పోతుందని తెలిసి చంద్రబాబుకు విజ్ఞత ఉందని కొత్త కబుర్లు చెబుతున్నారు. పధ్నాలుగు ఏళ్లు చంద్రబాబు బాగా పరిపాలించారని అంటున్నారు. కృష్ణదాసు వ్యాఖ్యలు ఒక్క సారిగా హైలెట్ అయ్యాయి. వైసీపీలోని అలజడి రేగింది. నిజానికి మంత్రి పదవి నిలబెట్టుకోవడానికి ఇంత కాలం మంత్రులు టీడీపీపై..చంద్రబాబుపై బూతుల దాడి చేశారు.
అలా చేస్తేనే జగన్‌ను మెప్పించవచ్చనుకున్నారు. ఇప్పుడు రేస్ ముగిసింది. పదవులు ఊడటం ఖాయమయింది. తాను చేసిన దాడులు.. వాడిన బూతులకు తర్వాత తమకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనన్న ఆందోళన వైసీపీ నేతల్లో ఇప్పుడు ప్రారంభమైందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే ఇప్పుడు ఒక్కొక్కరు తమను తాను సంస్కారవాదిగా ప్రచారం చేసుకుంటున్నారని భావిస్తున్నారు. పదవి పోయిన తర్వాత మిగతా వారు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది