కొత్త మంత్రుల ప్రమాణస్వీకార వేదికపై అధికారులు ఓ క్లారిటీకి వచ్చారు. మొదట విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో చేయాలనుకున్నారు. కానీ మూడు రోజులే సమయం ఉండటం.. ప్రమాణస్వీకారం చేస్తోంది సీఎం కాదు కాబట్టి ఆ రేంజ్ అవసరం లేదనుకున్నారు. తర్వాత రాజ్‌భవన్‌లోనే చేయాలనుకుని ఆలోచించారు. కానీ ఎక్కువ మంది వస్తారు కాబట్టి అలాంటి ఏర్పాట్లు సాధ్యం కావని అంచనాకు వచ్చారు.
చివరిగా సచివాలయంలోని అసెంబ్లీ పార్కింగ్ స్థలంలో ప్రమాణ స్వీకారానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రితో నూతన మంత్రివర్గ సభ్యులతో గ్రూపు ఫోటో దిగడానికి కూడా ఏర్పాట్లు చేయనున్నారు. సచివాలయంలో ఇంత వరకూబహిరంగ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనలేదు. అమరావతి ఉద్యమం ప్రారంభమైన తర్వాత అసలు పాల్గొనలేదు.
భద్రతాపరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే రాకపోకలు సాగించేవారు. కేవలం కేబినెట్ భేటీలకు మాత్రమే సీఎం సచివాలయానికి వచ్చేవారు. ఇప్పుడు బహిరంగంగా జరుగుతున్న కార్యక్రమం కావడంతో అధికారులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎలాంటి నిరసనలు వ్యక్తం కాకుండా చూసుకోవాలనుకుంటున్నారు. పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరిస్తున్నారు.