ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సభ్యులకు సీఎం జగన్ మరో చాన్సిచ్చారు. గత కేబినెట్ సమావేశంలో ఇదే చివరి సమావేశం అన్నట్లుగా మాట్లాడారు కానీ… ఇప్పుడు ప్రక్షాళన కంటే ముందే మరో కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నారు. ఏడో తేదిన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో మంత్రులందరి వద్ద సీఎం జగన్ రాజీనామాలు తీసుకోబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎనిమిదో తేదీన సీఎం జగన్ గవర్నర్ను కలిసి మంత్రుల మార్పుపై తెలియచేయబోతున్నారు. అందరి రాజీనామాలు సమర్పించి ఆమోదించాలని కోరే అవకాశం ఉంది.
ఆ తర్వాత 11వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారు చేస్తున్నట్లుగా అనుమతి తీసుకునే చాన్స్ ఉంది. మంత్రుల వద్ద నుంచి రాజీనామా తీసుకోవడానికే కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. సామాజిక సమీకరణాలు ఇతర కొలతల వల్ల కొంత మందిని కొనసాగిస్తానని సీఎం జగన్ చెప్పడం కొంత మంది మంత్రులకు నచ్చడం లేదు. కొంత మందిని తొలగించి.. కొంత మందిని ఉంచి.. తొలగించే మంత్రులకు అవమానమని.. తీసేస్తే అందర్నీ తీసేసి వంద శాతం కొత్త వారినితీసుకోవాలని అంటున్నారు. పలువురు సీనియర్ మంత్రులదీ ఇదే అభిప్రాయం. దీంతో అందర్నీ తొలగించాలన్న ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఏడో తేదీన కేబినెట్ భేటీలో అందరి రాజీనామాపత్రాలు తీసుకుని గుడ్ బై చెబుతారు. తర్వాత కొత్త మంత్రులెవరో పదో తేదీన వారికి సమాచారం చేరుతుంది. ప్రమాణస్వీకారం లేదా… అంతకు ముందే కొత్త , పాత మంత్రులకు సీఎం జగన్ విందు ఇస్తారని అంటున్నారు. ఈ మార్పుతో ఎక్కడా పార్టీలో సెగలురేగకుండా సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తుగా కసరత్తు చేస్తున్నారు.