తిరుమల శ్రీవారి టిక్కెట్ల కేంద్రంగా ప్రజాప్రతినిధులు ఎన్ని లక్షలు సంపాదిస్తారో కొండ మీద పాతుకుపోయిన ప్రతి ఒక్కరికీ తెలుసు. తమ సిఫార్సు లేఖలతో ప్రోటోకాల్ దర్శన టిక్కెట్లు తీసుకుని అమ్ముకుంటూ ఉంటారు. టీటీడీ బోర్డు సభ్యుల్లో అత్యధిక మంది చేసే పనిఇదే. ఇక ఎమ్మెల్యేల సంగతి చెప్పాల్సిన పని లేదు. అయితే విచిత్రంగా ఓ ఎమ్మెల్సీ ఇదే పని చేస్తున్నారని విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేసి..మీడియాకు గొప్పగా ప్రకటించారు. ఆయన టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ.
షేక్ షాబ్జీ తిరుమలకు వెళ్లారు. మరో పది మందిని తీసుకెళ్లారు. వారందరితో ప్రోటోకాల్ దర్శనం చేయించారు. ఎందుకో కానీ షాబ్జీ మీద టీటీడీ అధికారులకు కోపం వచ్చింది. వెంటనే ..దర్శనానికి వచ్చిన వారి గుర్తింపు కార్డులు పరిశీలించారు. తప్పుడు ఆధార్ కార్డులు ఉన్నాయని చెప్పి.. అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. వచ్చిన వారంతా ప్రోటోకాల్ దర్శన టిక్కెట్లు ఒక్కోటి పది వేల చొప్పున కొన్నారని.. షాబ్జీ అమ్మారని గుర్తించారు. షాబ్జీ డ్రైవర్ ఖాతాలోకి లక్షకుపైగా నగదు జమ చేసినట్లుగా తెలుసుకుని కేసు నమోదు చేసి.. పోలీసులకు అప్పగించారు.
ఎమ్మెల్సీ షాబ్జీ తరచూ తిరుమలకు వెళ్తున్నారు. తనతో పాటు పది నుంచి ఇరవై మంది వరకూ తీసుకెళ్తున్నారు. వారందరిదగ్గర డబ్బులు వసూలుచేస్తున్నారో లేదో స్పష్టత లేదు కానీ.. ఆయన మాత్రం బ్లాక్ టిక్కెట్ల వ్యాపారం చేస్తున్నారన్న అనుమానాలు మాత్రం చాలా మందిలో ఉన్నాయి. నిజానికి కొండపై ఓ దళారుల గుంపు ఉంటుది. వారి దగ్గర ఒప్పందం చేసుకున్న వీఐపీల సిఫారసు లేఖలు రెడీగా ఉంటాయి. ఆ లేఖలు పెట్టి టిక్కెట్లు తీసుకుంటారు.. బ్లాక్ లో అమ్మేస్తారు. కానీ షాబ్జీ మాత్రం దొరికిపోయారు.
మరో పదిహేడు మంది ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇలా టిక్కెట్లు అమ్ముతున్నట్లుగా తెలిసిందని వారిని కూడా ట్రాప్ చేస్తామని విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు. కానీ వైసీపీ వాళ్లు మాత్రం ఏమైనా చేయవచ్చన్న రాజ్యాంగం ఏపీలో నడుస్తోంది కాబట్టి వారెప్పటికీ దొరకరు.