శాసనమండలి విషయంలో ఏపీ ప్రభుత్వం తీరు రాజ్యాంగాన్ని ధిక్కరించేది ఉందంటున్న ఇతర పార్టీల ఎమ్మెల్సీలు అందరూ రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో టీడీపీ తో పాటు.. పీడీఎఫ్… బీజేపీ ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. మండలి రద్దు తీర్మానంపై కేంద్ర న్యాయ మంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి, ప్రధాని, రాష్ట్రపతిని కలవాలని ఎమ్మెల్సీలు భావిస్తున్నారు. మండలిని జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా రద్దు చేశారని.. ఇప్పటివరకు 38 బిల్లులను ఆమోదించామని ఎమ్మెల్సీలు అందరికీ చెప్పనున్నారు. రెండు బిల్లులకు సవరణలు కోరామని, మరో రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపామని .. ఏ బిల్లునూ తిరస్కరించలేదని చెబుతామంటున్నారు.
ఏపీ సర్కార్ ప్రవేశ పెట్టిన చట్ట వ్యతిరేక బిల్లుల గురించి కేంద్ర పెద్దలకు.. రాష్ట్రపతికి కూడా వివరించాలని ఎమ్మెల్సీలు భావిస్తున్నారు. ఇంగ్లిష్ మీడియం బిల్లు విషయంలో.. మీడియాన్ని నిర్ణయించుకునే హక్కు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కల్పించాలని సవరణ కోరామని.. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు మాతృభాషలో బోధన జరగాలని ఇప్పటికే చట్టాలు చెబుతున్నాయని ఎమ్మెల్సీలు చెబుతున్నారు. శాసనమండలిపై ముఖ్యమంత్రి అగౌరవ వ్యాఖ్యలు చేస్తున్నారని ఎమ్మెల్సీలు మండి పడుతున్నారు. ప్రొటోకాల్ లో గవర్నర్ తర్వాత శాసనమండలి చైర్మన్ వస్తారని, అటువంటి చైర్మన్ ను, మండలి సభ్యులను జగన్ అగౌరవపరిచారని తెలుగుదేశం అంటోంది.
టీచర్లు, లాయర్లు, డాక్టర్లు ఉన్న మండలిపై సీఎం అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు. మండలిని రద్దు చేయాలని… బిల్లును వేగంగా ఆమోదించాలని.. జగన్మోహన్ రెడ్డి కేంద్రంవద్ద లాబీయింగ్ చేసుకుంటున్నారు. ఈ సమయంలో పోటీగా అసలు మండలి రద్దు విషయంలో జగన్మోహన్ రెడ్డి దురుద్దేశాలు ఉన్నాయని చెప్పేందుకు… ఇతర పార్టీల ఎమ్మెల్సీలు ఢిల్లీకి బయలుదేరుతున్నారు.