ఆంధ్రప్రదేశ్ లో మోడల్ స్కూల్ లో గెస్ట్ టీచర్స్ గా పని చేసిన ఉద్యోగుల వెతల కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రభుత్వ పెద్దలను ఎన్నిసార్లు కలిసినా, తమకు చెల్లించవలసిన బకాయి జీతాలు ప్రభుత్వం చెల్లించడం లేదని, పైగా కరోనా విపత్తు సమయంలో లాక్ డౌన్ కారణంగా తామందరూ ఉపాధి కోల్పోయామని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ మొరలను పట్టించుకోవడంలేదని, కొందరు గెస్ట్ టీచర్స్ ఉపాధి కోల్పోయి, బకాయి జీతాలు రాక ఆత్మహత్యాయత్నాలకి పాల్పడుతున్నారని, ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా తమది అరణ్యరోదనగా మిగిలిపోతోందని ఆంధ్ర ప్రదేశ్ మోడల్ స్కూల్ గెస్ట్ టీచర్స్ కన్నీటి పర్యంతం అవుతున్నారు. నిజంగా వారికి బకాయిలు చెల్లించే లేని దుస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందా? సంక్షేమం పేరిట కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం వీరి పట్ల మాత్రం వివక్ష చూపిస్తోందా? అసలు సమస్య ఏంటి? ఆంధ్ర ప్రదేశ్ మోడల్ స్కూల్ టీచర్స్ ప్రభుత్వం నుండి ఏం కోరుతున్నారు? వివరాల్లోకి వెళితే..
అసలు సమస్య ఏంటి?
ఆంధ్ర ప్రదేశ్ లో ఆదర్శ పాఠశాల ల పేరిట ప్రారంభమైన మోడల్ స్కూల్స్ గ్రామీణ ప్రాంతాల్లో విద్యాబోధన విషయంలో మెరుగైన ప్రమాణాలు చూపుతూ ఉన్నాయి. అయితే మోడల్ స్కూల్స్ లో బోధించడానికి అవసరమైన అధ్యాపకులు తగిన సంఖ్యలో లేకపోవడం వల్ల గెస్ట్ టీచర్స్ పేరిట క్వాలిఫైడ్ అభ్యర్థులను ప్రభుత్వం నియమించింది. 2015 సంవత్సరం నుండి మోడల్ స్కూల్ లో గెస్ట్ టీచర్స్ గా పనిచేస్తున్న వారు చాలామంది ఉన్నారు. వీరికి గంటల లెక్కన బోధించిన సమయానికి జీతాలు చెల్లిస్తారు. అయితే పేరుకు గెస్ట్ టీచర్స్ అయినప్పటికీ రోజంతా స్కూల్లో ఉండవలసి రావడం, పర్మనెంట్ టీచర్స్ కంటే ఎక్కువ క్లాసులు తీసుకోవాల్సి రావడం, అంత సమయం పని చేసినప్పటికీ ఉద్యోగ భద్రత లేకపోగా, పని చేసిన మొత్తం గంటలకు కాకుండా కొన్ని గంటలు మాత్రమే రికార్డు చేసి వాటికి మాత్రమే జీతాలు చెల్లించడం లాంటి సమస్యలు వీరు మొదటినుండి ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యలకు తోడు 2018 డిసెంబర్ లో, వీరిలో చాలా మందిని అప్పటి ప్రభుత్వం ఇటువంటి ముందస్తు నోటీసులు లేకుండా ఉద్యోగాల నుంచి తీసివేసింది. మరి కొంత మందిని 2019 మార్చ్ లో తీసివేసింది. ఇక 2020 మార్చి లాక్ డౌన్ తర్వాత గెస్ట్ టీచర్స్ అన్న వారు పూర్తిగా ఉపాధి కోల్పోయి రోడ్డున పడడం జరిగింది. వీరిలో చాలా మందికి 2018, 2019 సంవత్సరాలలో పని చేసినప్పటికీ జీతాలు ప్రభుత్వం నుండి రావాల్సి ఉంది.
2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీ ఇప్పుడు ఏమైంది?
అయితే అప్పటి ప్రతి పక్ష నేతగా ఉన్న జగన్ పాదయాత్ర సమయంలో తనను కలిసిన మోడల్ స్కూల్ గెస్ట్ టీచర్స్ కు పలు హామీలు ఇచ్చారు. వీటిలో అత్యంత ముఖ్యమైనది ఉద్యోగ భద్రత. గెస్ట్ టీచర్స్ గా తాము చాలామంది మూడేళ్లకు పైగా పని చేస్తున్నామని కొందరు ఐదేళ్ళ కు పైగా పనిచేస్తున్నామని చెబుతూ తమ సమస్యలను జగన్ కు విన్నవించుకోగా, జగన్ ” మన ప్రభుత్వం రాగానే, గెస్ట్ టీచర్స్ అందరిని కాంట్రాక్టు పద్ధతిలో కి మారుస్తామని, గంటలను బట్టి జీతం ఇచ్చే పద్ధతిని రద్దుచేసి కాంట్రాక్టు పద్ధతిలో నెలసరి వేతనం ఇస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని” హామీ ఇచ్చారు. జగన్ చెప్పినట్టు ప్రభుత్వం రానే వచ్చింది కానీ , గెస్ట్ టీచర్స్ పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు రాలేదు.
కాలికి బలపం కట్టుకుని తిరుగుతూ ప్రభుత్వ పెద్దలను కలిసిన గెస్ట్ టీచర్స్:
అయితే జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాకపోవడం, పైగా హామీ ఇచ్చిన విధంగా గెస్ట్ టీచర్స్ ని కాంట్రాక్ట్ టీచర్స్ గా మార్చకపోవడం కారణంగా- గెస్ట్ టీచర్స్ ఒక సంఘంగా ఏర్పడి పలుమార్లు జగన్ ప్రభుత్వం లో ని పెద్దలను కలిశారు. విద్య శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ నుండి ఏ మాత్రం కనీస స్పందన రాకపోవడంతో, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని కూడా వీరు కలిశారు. పలు మార్లు ప్రయత్నించినప్పటికీ జగన్ అపాయింట్మెంట్ దొరక పోయినా నిరుత్సాహ పడకుండా, పట్టువదలకుండా ప్రయత్నించి జగన్ అపాయింట్మెంట్ సంపాదించి, ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్ ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి హోదాలో ని జగన్ కి గుర్తు చేశారు. అయినప్పటికీ సమస్య తీరలేదు. గెస్ట్ టీచర్స్ గా ఉన్న తమను కాంట్రాక్ట్ టీచర్స్ గా మారుస్తాం అన్న పాదయాత్ర హామీని అమలు చేయడం మాట దేవుడెరుగు, ప్రభుత్వం నుండి తమకు రావలసిన బకాయి జీతాలు కూడా, జగన్ ని కలిసిన తర్వాత కూడా రాకపోవడం గెస్ట్ టీచర్స్ కి విస్మయం కలిగించింది.
గెస్ట్ టీచర్స్ కోరుతోంది ఏంటి?
జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చిన విధంగా వీరిని కాంట్రాక్ట్ టీచర్స్ గా తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించే అంశం మరుగున పడిపోయింది. రావలసిన బకాయిలు జీతాలు ఇప్పటి దాకా రాలేదు. ఈ రెండింటికీ మించి, కోవిడ్ విపత్తు పుణ్యమా అని ఉన్న ఉద్యోగాలు కూడా మొత్తంగా పోయాయి. ఒక ప్రైవేటు సంస్థలో కొన్నేళ్ల పాటు పనిచేసిన వారికి సైతం ఆయా సంస్థలు ఎంతో కొంత సహాయం చేస్తూ ఉంటే, ప్రభుత్వం తమను గాలికి వదిలివేయడం ఈ బోధకులకు కళ్ళ వెంబడి నీరు తెప్పిస్తోంది. పైగా సంక్షేమం పేరిట కోట్లాది కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, తాము చేసిన పనికి తమకు రావలసిన జీతపు బకాయిలను చెల్లించకపోవడం వీరికి కడుపు మండిస్తోంది.
వీరు ప్రస్తుతం కోరుతున్నది – గెస్ట్ టీచర్ గా పని చేసిన తమను పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ టీచర్స్ గా తీసుకోమని, రావలసిన బకాయి జీతాలను తక్షణమే చెల్లించాలని మాత్రమే !. అయితే ప్రభుత్వం నిజంగా వీరి పట్ల మరింత సానుకూలంగా స్పందించదలుచుకుంటే, గిరిజన విద్యార్థుల కోసం ఏర్పాటు కానున్న ఏకలవ్య మోడల్ స్కూల్స్ నియామకాల్లో ఇది వరకు గెస్ట్ టీచర్ గా పని చేసిన వీరికి కొంత వెయిటేజ్ ఇవ్వవచ్చు.
ఏది ఏమైనా తాము చేసిన పనికి తమకు రావాల్సిన జీతపు బకాయిలను చెల్లించి ఆదుకోవాల్సిందిగా వీరు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అదే విధంగా పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వీరు కోరుతున్నారు. మరి జగన్ ప్రభుత్వం వీరి గోడు వింటుందా అన్నది వేచి చూడాలి.