జల్లికట్టుపై ఆర్డినెన్స్ తెచ్చుకుని తమిళ ప్రజలు ఐకమత్యాన్ని చాటుకున్న సంగతి తెలిసిందే. చట్టవిరుద్ధం అని కోర్టు చెప్పినా కూడా ప్రజలు పోరాడి సాధించుకున్నారు. కానీ, చట్టప్రకారం ఆంధ్రాకి రావాల్సిన ప్రత్యేక హోదాపై ఆ స్థాయి పోరాటం ఏదీ..? ఇప్పుడు ఇదే చర్చ ఏపీలో మొదలైంది. జల్లికట్టు ఉద్యమ నేపథ్యంలో మరోసారి ప్రత్యేక హోదా అంశం ప్రముఖంగా వినిపిస్తోంది. విపక్షాలు ఒక్కోటిగా కేంద్రంపై పోరాటానికి సంసిద్ధం కావాలంటూ పిలుపునిస్తున్నాయి. ఇప్పటికే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు. ప్రత్యేక హోదా సాధన కోసం ముఖ్యమంత్రి ఉద్యమిస్తే ఆయన వెంట నిలిచేందుకు అన్ని పార్టీలూ సిద్ధం అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఆంధ్రా నేతల తీరుపై ఘాటుగానే స్పందించారు. తాజాగా, ఎంపీల రాజీనామా అంశాన్ని ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా తెరమీదికి తెచ్చింది.
ప్రత్యేక హోదా సాధించడం కోసం ప్రభుత్వం పోరాటం ప్రారంభించాలనీ, దాన్లో భాగంగా రాష్ట్రానికి చెందిన పాతికమంది ఎంపీలూ ఒకేసారి రాజీనామా చేయాలని ఆ పార్టీ ప్రతిపాదించింది. ఆంధ్రా పార్లమెంటు సభ్యులందరూ ఒకేసారి రాజీనామాకు దిగితే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందనీ, ప్రత్యేక హోదా కచ్చితంగా సాధించుకోగలమంటూ ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎంపీలూ రాజీనామాలు మొదలుపెట్టాలనీ, కేంద్రంపై ఉద్యమించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధమా అంటూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమాన కరుణాకర్‌రెడ్డి సవాల్ చేశారు.
నిజానికి, ఆంధ్రా ఎంపీలు అందరూ తల్చుకుంటే కేంద్రంపై ఒత్తిడి పెంచడం ఏమంత కష్టమైన పనికాదు! ఆ పనిచేయడానికి జల్లికట్టు స్ఫూర్తే అక్కర్లేదు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం తల్చుకుంటే చాలదా..? కానీ, అధికార పార్టీ ఎంపీల్లో ఆ చొరవ ఏదీ..? వారిలో ఉద్యమ స్ఫూర్తి ఆశించగలమా..? ప్రత్యేక హోదాకి బదులుగా ప్యాకేజీ ఇస్తున్నప్పుడే టీడీపీ ఎంపీలు నోరెత్తలేకపోయారు! మాట తప్పుతున్నారంటూ భాజపా సర్కారును నిలదీయలేకోయారు. ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రతిపాదనపై స్పందిస్తారని ఊహించలేం. జల్లికట్టు అంశానికి వీలైనంత దూరంగా ఉండే ప్రయత్నమే చేస్తారు!
అయితే, తెలుగుదేశం ఎంపీలపై ఒత్తిడి పెంచాలంటే వైకాపా ఎంపీలు రాజీనామాలకు దిగాలి. ముందుగా వారు ఈ ప్రక్రియ మొదలుపెడితే… అధికార పార్టీపై టెన్షన్ పెరగడం ఖాయం. వైకాపా కూడా ఈ రాజీనామా మాట ఎప్పట్నుంచో చెబుతూనే వస్తోంది. మరి, ఈ ప్రతిపాదన ఇప్పుడూ ప్రకటలన స్థాయికే పరిమితం అవుతుందో.. కార్యాచరణ వరకూ వెళ్తుందో చూడాలి మరి!