ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజకీయంగా చైతన్యవంతులు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందుంటారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎనభై శాతానికిపైగా ఓటింగ్ నమైదైంది. పల్లె పోరులోనూ ఆ జోరు కనిపించింది. కానీ అనూహ్యంగా మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో 62 శాతం మాత్రమే ఓటింగ్ నమోదయింది. అంటే ఎప్పుడూ ఓటు హక్కు వినియోగించుకునేవారిలో 18శాతం మంది ఈ సారి ఓటు వేయడానికి ఆసక్తి చూపించలేదు. ఎందుకిలా..? ఆ ఓటర్లు అంతా ఎవరు..? వాళ్లంతా ఓటు వేయకపోవడం వల్ల ఎవరికి నష్టం జరిగింది..?
స్థానిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోని ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లు..!
రాజకీయాల్లో ఒక్క ఓటు కూడా గెలుపోటముల్ని నిర్ధారిస్తుంది. అందుకే రాజకీయ పార్టీలు ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా ఓట్ల వేట సాగిస్తాయి. అలాంటిది.. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పద్దెనిమిది శాతం ఓట్లు తగ్గాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎనభై శాతం మేర నమోదైన పోలింగ్.. రెండేళ్లలో పద్దెనిమిది శాతం మేర తగ్గిపోయింది. సాధారణంగా ప్రభుత్వాన్ని ఎన్నుకునే జనరల్ ఎలక్షన్స్‌లో ఓటింగ్ ఎక్కువ జరుగుతుంది. స్థానిక ఎన్నికలు… ఉపఎన్నికల్లో ఓటింగ్ పర్సంటేజీ తగ్గుతుంది. తాము వేసే ఓటు ఎలాగూ నిర్ణయాత్మకం కాదన్న ఉద్దేశంతో చాలా మంది ఆగిపోతారు. అందుకే పోల్ పర్సంటేజీ తగ్గుతుంది. అదే సమయంలో… ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పటికీ.. ఓటు రూపంలో దాన్ని స్థానిక ఎన్నికల్లో చూపించలేని ఓటర్లు కూడా.. ఓటింగ్‌కు దూరంగా ఉండిపోతారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్‌లో జరిగింది అదే.
వ్యతిరేకంగా ఓటు వేసి సాధించేదేమిటని నిర్లిప్తత..!
స్థానిక ఎన్నికల్లో ఓటింగ్‌కు రాని వర్గాలు ఎక్కువగా తటస్థ ఓటర్లు… స్వింగ్ ఓటర్లు. మధ్యతరగతి ఓటర్లు… ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లు… పెద్దగా ఓటు వేయడానికి ఆసక్తి చూపించరు. ఇప్పుడు మైక్రో లెవల్ రాజకీయం చేస్తున్నారు కాబట్టి.. .ఎవరు ఏ పార్టీ వారో సులభంగానే అర్థమైపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లు చాలా మంది పోలింగ్ బూత్‌కు వెళ్లడానికి ఆసక్తి చూపించలేదు. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత విపరీతంగా ఉంటే వచ్చి ఉండేవారు. స్థానిక ఎన్నికల్లో మరీ అంత తీవ్రమైన వ్యతిరేకత ఉండకపోవడం వల్ల కూడా ఓటింగ్ పర్సంటేజీ తగ్గిపోయిందని భావిస్తున్నారు.
తగ్గిన విపక్షాల ఓట్లే .. ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లు స్పందించలేదనడానికి సాక్ష్యం..!
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో టీడీపీ సానుభూతిపరులు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. వారి వ్యాపారాలు.. ఉద్యోగాలు… ఉపాధి ఇలా ప్రతీదీ మ్యాపింగ్ చేసిన పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి సంబంధించిన అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండటానికి అనేక మంది ఓటింగ్‌కు దూరం గా ఉన్నారు. టీడీపీ సానుభూతిపరులతోపాటు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న వారూ.. తమ ఓటును వినియోగించుకోలేదు. అన్నీ కలిపి… ప్రతిపక్షం ఓటు షేర్ ను తగ్గిపోయేలా చేసింది. తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంక్ ఎనిమిది శాతం కన్నా ఎక్కువగా తగ్గిపోవడానికి ఇదే కారణం అయింది. అదే సమయంలో ఇతర పార్టీల ఓటు బ్యాంక్ కూడా తగ్గిపోవడం దీనికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. అధికార పార్టీకి స్వల్పంగా ఓట్లు పెరిగాయి కానీ… విపక్షాలన్నింటికీ తగ్గాయి. ఈ లాజిక్‌తోనే… ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారని అర్థమైపోతుంది.