ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందని.. దాన్ని భర్తీ చేయాలని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి రామ్‌మాధవ్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోము వీర్రాజు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ నుంచి వచ్చారు. వచ్చే నాలుగేళ్లు కష్టపడి బీజేపీని అధికారంలోకి తీసుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీ సర్కార్ చేపట్టిన మూడు రాజధానుల నిర్ణయంలో అవినీతి ఉందని.. ఆ అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు ఒకే ఒక్క రాజధాని ఉందని గుర్తు చేశారు. అక్కడ పాలన సజావుగా సాగుతూంటే.. ఇక్కడ మాత్రం మూడు రాజధానులు ఎందుకని ప్రశ్నించారు. అవినీతి కోసమే మూడు రాజధానులని తేల్చేశారు.
మరో సోము వీర్రాజు కూడా తన లక్ష్యాన్ని ప్రకటించారు. 2024లో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతామని శపథం చేశారు. బీజేపీది ఎప్పుడూ ఒకటే మాట.. ఒకటే సిద్ధాంతమని అన్నారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన తేల్చి చెప్పారు. ఏపీ ప్రభుత్వం కోవిడ్ ఎమర్జెన్సీ ప్రకటించి..15 రోజుల పాటు దానిపై దృష్టి పెట్టాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కన్నా లక్ష్మినారాయణ సోము వీర్రాజుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు.
సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టేందుకు వచ్చిన వారిలో.. ఒక్క రామ్‌మాధవ్ మాత్రమే కాస్త ఘాటుగా.. ప్రభుత్వ అవినీతి గురించి మాట్లాడారు. మిగతా ఎవరూ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు గురించి పెద్దగా ప్రస్తావించలేదు. పైపైన విమర్శలు చేశారు. ఇంకా విశేషం ఏమిటంటే.. రామ్‌మాధవ్ కూడా.. ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేశారు. ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేస్తామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి కానీ రాజధాని అంశంపై కానీ తామేం చేస్తామో చెప్పలేదు. రాజధాని రైతుల కోసం పోరాడతామని మాత్రం చెప్పారు. ఎవరిపై పోరాడి… అమరావతి రైతులకు న్యాయం చేస్తారో మాత్రం.. క్లారిటీ ఇవ్వలేకపోయారు.