తెలుగుదేశం, వైకాపా, భాజపాలు చేస్తున్న నిరసనలు చూస్తుంటే నమ్మశక్యంగా లేవని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. వాళ్లే ప్రభుత్వాల్లో ఉంటూ, వాళ్లూ బాధితులు మాదిరిగా మాట్లాడుతున్నారన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిరసన వ్యక్తం చేస్తే… ఆయన్ని అందరూ అపహాస్యం చేశారన్నారు. అదే పని ఇవాళ్ల భాజపా చేస్తోందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య శక్తిగా ఉన్న దేశానికి ప్రధాని అయిన నరేంద్ర మోడీ చాలా నిస్సహాయంగా నిరసన చేస్తున్నారని విమర్శించారు. పార్లమెంటును తాము నడపలేమంటూ నిస్సహాయత వ్యక్తం చేయడం నమ్మశక్యంగా లేదన్నారు. ఆయన బలమైన వ్యక్తి అని తనతో సహా ప్రజలందరూ నమ్మారనీ, కానీ, ఆయన ఇలా దీక్షలు చేయడమేంటన్నారు. అవిశ్వాస తీర్మానం నిజంగానే చర్చకు వచ్చి ఉంటే వాస్తవాలు బయటకి వచ్చేవన్నారు.
ప్రత్యేక హోదా అంశాన్ని భాజపా, టీడీపీ, వైకాపాలు దాటేస్తున్నాయన్నారు. అవిశ్వాసం చర్చకు రాకపోవడమే ఈ మూడు పార్టీలకు ఉపయోకరమని ఎద్దేవా చేశారు. ఇవాళ్ల వాళ్లే ప్రజల ముందుకు వచ్చి నిరసనలు చేయడాన్ని యువత, మహిళలు నమ్మడం లేదన్నారు. ప్రధాని మోడీ చేస్తున్న దీక్ష ఎంతగా నమ్మబుద్ధి కావడం లేదో, టీడీపీ పోరాటం కూడా అలానే ఉందన్నారు. ఈ పరిణామాలన్నింటినీ తాము ఒక తృతీయ శక్తిగా చూస్తున్నామనడం విశేషం. యువత ఆకాంక్షకీ, ఒక్క కొత్తతరం ఆశలకీ అనుగుణంగా రాజకీయ ప్రక్షాళనకి తాము శ్రీకారం చుట్టబోతున్నామన్నారు. ప్రత్యేక హోదా పేరుతో మూడు పార్టీలూ చేస్తున్నవి ఫక్తు రాజకీయాలే తప్ప, అంతకుమించి నిర్మాణాత్మకంగా కనిపించడం లేదన్నారు.
ఒక కొత్త, బలమైన రాజకీయ శక్తి రావాల్సిన అవసరం ఉందని పవన్ చెప్పారు. అలాంటి శక్తులు అన్ని జిల్లాల నుంచీ రావాలనీ, ఒకేలా ఆలోచన ఉన్నవారంతా కలిసి ముందుకు సాగాల్సి ఉందన్నారు. దాన్లో భాగంగా ఎవరు కలిసి వచ్చినా వామపక్షాలతోపాటు జనసేన కలిసి వెళ్తుందన్నారు. హోదా సాధన సమితి ఇచ్చిన బంద్ పిలుపునకు జనసేనతోపాటు సీపీఐ, సీపీఎం మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. పవన్ వ్యాఖ్యల్లో ‘కొత్త రాజకీయ శక్తి’ అనడం విశేషం. అయితే, పవన్ మాటల్లోని ఆ శక్తి అవసరం ప్రత్యేక హోదా అంశం వరకూ మాత్రమే పరిమితమా..? లేదా, వచ్చే ఎన్నికల్లో తనతోపాటు భావసారూప్యత కలిగిన పార్టీలూ సమూహాలను కలుపుకుని ముందుకు వెళ్తారా అనే స్పష్టత పవన్ ఇవ్వలేకపోయారు.