ఏపీ ప్రభుత్వం కొత్తగా ఓ జీవో విడుదల చేసింది. విడుదల చేస్తున్న అనేకానేక జీవోల్లో అదీ కూడా ఒకటి. ఆ జీవో సారాంశం.. ప్రతీ శుక్రవారం డ్రైడేపాటించాలని. డ్రై డే అనే పదాన్ని ఎక్కువగా.. ఎక్సైజ్‌లో వాడతారు. గతంలో వారానికోసారి లిక్కర్ షాపుల్ని మూసేసేవాళ్లు. అలా మూసేసిన రోజును డ్రైడే అనేవారు. అలా ఇప్పుడు కూడా… ప్రభుత్వం మద్యపాన నిషేధం కోసం డ్రైడే తెస్తుందేమోనని అనుకున్నారు. కానీ.. ఈ డ్రైడేకు… మద్యపాన నిషేధానికి సంబంధం లేదు. ఇది దోమల నియంత్రణకు సంబంధించినది. ప్రతీ శుక్రవారాన్ని డ్రైడేగా పాటిస్తూ.. అందరూ పరిసరాలను శుభ్రం చేసుకుని… దోమలను నియంత్రించాలన్నది ఆ జీవో సారాంశం.
ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే ..గత ప్రభుత్వంలో కూడా ఇదే చేసింది. దోమలపై దండయాత్ర పేరుతో గత ప్రభుత్వం.. పెద్ద ఎత్తున వారానికో రోజు ఇలాంటి కార్యక్రమాల్ని చేపట్టింది. ప్రత్యేకంగా ఫాగింగ్ యంత్రాలతో యుద్ధమే చేసింది. దోమలు నిల్వ ఉండే ప్రాంతాలను తగ్గించి.. పర్యావరణాన్ని మెరుగుపర్చడానికి తన వంతు ప్రయత్నం చేశారు. అదే ఫ్లాష్ బ్యాక్‌లో ఇంకొంచెం ముందుకు అంటే.. ప్రభుత్వం మారిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లోకి ఆర్థిక మంత్రి బుగ్గన మాటలు గుర్తు చేసుకోవాలి. గత ప్రభుత్వం దోమలపై దండయాత్ర అంటూ కార్యక్రమాలు చేసిందని.. సోషల్ మీడియా ట్రోలింగ్ తరహాలో.. విరుచుకుపడ్డారు. సభ్యులందరూ నవ్వుకున్నారు. ఆ ఏడాది… దోమల నివారణకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. కానీ ఎంత నష్టం జరిగిందో.. ప్రభుత్వ పెద్దలకు తెలిసిపోయింది.
అందుకే తాము అసెంబ్లీలో వెటకారం చేసినట్లుగా దోమలపై దండయాత్ర అని పేరు పెట్టకపోయినా… అంత కంటే తీవ్రంగానే వాటిపై యుద్ధం చేస్తున్నట్లుగా జీవో ఇచ్చారు. ఒక్క ఏడాది పరిసరాల పరిశుభ్రతను లైట్ తీసుకోవడం వల్ల.. డెంగ్యూ లాంటి జ్వరాల బారిన పడిన వారి సంఖ్య పెరిగింది. అందుకే.., ప్రభుత్వం కూడా ఆలోచించింది. గత ప్రభుత్వ కార్యక్రమం పేరు లేకపోయినా.. దోమలపై దండయాత్ర చేయాలని నిర్ణయించుకుంది.