ఏపీ నూతన రాజధాని అమరావతి నగరానికి శంకుస్థాపన అక్టోబర్ 22 (విజయదశమిరోజున) అట్టహాసంగా జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకుంటున్నారు. ఈ సందర్భంగా ద్వాపరయుగంలో పాండవులు నిర్మించుకున్న కొత్త రాజధాని ఇంద్రప్రస్థం గురించి కొంత చెప్పుకోవాలి. ఆనాడు శ్రీకృష్ణుడి ఆశీర్వాద బలంతో మయుడిచేత పాండవులు ఇంద్రప్రస్థం పేరిట రాజధాని నగరాన్ని అత్యద్భుతంగా నిర్మించారు. అసలు పాండవులు ఎందుకని అప్పటికప్పుడు కొత్త రాజధానిని నిర్మించుకోవాల్సివచ్చింది? ఎలాంటి ప్రదేశంలో వారు అద్భుతమైన రాజధానిని ఏర్పాటుచేసుకున్నారు? నాటి ఇంద్రప్రస్థంకీ నేటి అమరావతికి పోలికలేమిటీ? ఇలాంటి అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం…
ఇంద్రప్రస్థం కథ...
ధర్మచింతనులైన పాండవులను దుర్యోధనాదులకు దూరంగా గెంటివేయాలన్న దురుద్దేశంతో చక్రవర్తి ధృతరాష్ట్రుడు వారిని పిలిచి `నాయనలారా, మీరు ఖాండవప్రస్థం అనే చోటికి వెళ్ళి అక్కడ సుఖంగా ఉండండి… ‘ అని ఆదేశించాడు. మహారాజు ఆదేశానుసారంగా పాండవులు ఖాండవప్రస్థం చేరారు. అయితే, అది ఎలా ఉన్నదంటే- పూర్తిగా కొండలు గుట్టలు, చెట్లూచేమలూ… జనసంచారం చాలాతక్కువ.
మహాసౌధాలతో కళకళలాడే హస్తినాపురి ఎక్కడ ? ఈ అటవీప్రాంతమైన ఖాండవప్రస్థం ఎక్కడ? కానీ, ధృతరాష్ట్రులవారు మాత్రం- `నాయనలారా, హస్తినాపురి ఎంతో ఈ ఖాండవప్రస్థం కూడా అంతే సుమీ… మీరక్కడ సుఖశాంతులతో వర్థిల్లండి’ అంటూ ఎలాంటి అనుమానాలకు తావులేదన్నట్టుగా తేల్చి చెప్పాడు. పాండవులు హస్తినాపురి విడిచి ఖాండవప్రస్థం బయలుదేరారు. ఈ రాజ్యపంపకం హస్తినాపురవాసులకు నచ్చలేదు. ఇది అన్యాయమని వాపోయారు. కానీ మహారాజు నిర్ణయాన్ని ఎదిరించలేకపోయారు. పాండవులు ఖాండవప్రస్థం వెళ్ళిచూశారు. అక్కడ మెరక, పల్లపు భూములు చాలానేఉన్నాయి. చిన్నచిన్న గుట్టలు, భయంకరమైన అడవులు…అక్కడక్కడా పల్లెలు కనిపించాయి. ఇదీ ఖాండవప్రస్థ భౌగోళిక స్థితి. అయితే ఒకే ఒక్క సౌకర్యం ఉంది. ఈ ప్రాంతం పక్కనుంచే యమునానది ప్రవహిస్తోంది. ఈలాంటి ఖాండవప్రస్థాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని యుధిష్టిరుడు సంకల్పం చెప్పుకున్నాడు. అందుకు శ్రీకృష్ణుడు మద్దతు పలికాడు. స్థానికుల సాయంతో అటవీభూములను వ్యవసాయానికి అనుకూలంగా మలుచుకున్నారు. సకాలంలో వానలు పడటంతో నదులూ వాగులూ ఒప్పొంగాయి. పంటలు బాగా పండాయి. తినడానికి తిండి, త్రాగడానికి నీరు సంవృద్ధిగా అందుబాటులోకి వచ్చింది. దీంతో అభివృద్ధికి బాటలుపడ్డాయి. అవసరమైన చోట్ల రహదారులు నిర్మించారు. నెమ్మదిగా వాణిజ్యానికి అనుకూలవాతావరణం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న వర్తక శ్రేణులు తమ వ్యాపారాలను ఈ ప్రాంతానికే తరలించారు. ధనధాన్యరాశులు వచ్చిపడుతున్నాయి. పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం ఉరకలెత్తుతోంది. హస్తినాపురికి తీసిపోని విధంగా ఖాండవప్రస్థం రూపుదిద్దుకుంటోంది. ఖాండవప్రస్థం కాస్తా ఇంద్రప్రస్థంగా మారిపోయింది. అంటే సాక్షాత్తు ఇంద్రుడు నివసించే ప్రాంతంలా విరాజిల్లింది. పాలనాపరమైన సౌకర్యాల కోసం ఒక రాజ్యసభ అవసరమైంది. దేవతలశిల్పి మయుడు ఆనాటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకుని అందమైన రాజ్యసభను నిర్మించారు. ఆసభకు మయసభ అన్న పేరు సార్థకమైంది. సామంతరాజులు ధర్మరాజుని కీర్తించారు. అడవిలో పడిఉండమని చక్రవర్తి శాసించినా కారడవిని మహానగరంలా మార్చిన పాండవుల తెలివితేటలు చూసి దుర్యోధనాదులకు కన్నుకుట్టింది. పాండవులు నిర్వహించిన రాజసూయ యాగంతో ఈర్ష పతాకస్థాయికి చేరుకుంది. వెళ్లకూడదనుకుంటూనే ధుర్యోధనాదులు రాజసూయయాగానికి వెళ్ళారు. అక్కడి మయసభను విభ్రాంతితో చూశారు. దుర్యోధనుడు చిత్తభ్రాంతికి గురై మడుగులో కాలుజారి పడ్డాడు. అదే సమయంలో అక్కడున్న పాంచాలి నవ్వింది. దీంతో పరాభవాగ్నితో దహించుకుపోతున్న దుర్యోధనుడ్ని శాంతిపచేయడానికి శకుని మాయాజూదం అంకానికి తెరతీశారు. ఫలితంగా చివరకు మహాభారత యుద్ధం జరిగింది. ఇదీ నాటి ఇంద్రప్రస్థ కథ.
నేటి అమరావతి కథ..
తెలుగు రాష్ట్రంగా ఉండే అవిభక్త ఆంధ్రప్రదేశ్ నుంచి అనివార్యకారణాల వల్ల తెలంగాణ విడిపోయింది. దీంతో రాజధాని లేని ముక్క నవ్యాంధ్రప్రదేశ్ గా మారిపోయింది. పాలనా సౌలభ్యం కోసం కొత్త రాజధాని నిర్మాణం అవశ్యమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు భుజస్కంధాలపై ఈ బాధ్యత పడింది. గుంటూరు జిల్లాలో కృష్ణానదికి చేరువలో రాజధాని నిర్మాణం చేయాలనుకున్నారు. ఇంద్రప్రస్థం యమునానదికి చేరువలో కడితే నేటి అమరావతిని కృష్ణానది పక్కన నిర్మించడం గమనార్హం. నదిపక్కన రాజధాని ఉంటే అది ఎంతగా అభివృద్ధి చెందుతుందో నాటి ఇంద్రప్రస్థం చెప్పకనేచెప్పింది. నాటి ఇంద్రప్రస్థ నిర్మాణానికి శ్రీకృష్ణుడంతటి వాడు మద్దతు పలికినట్లుగా నేటి అమరావతి నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోదీ సపోర్ట్ గా నిలిచారు. అలనాడు మయుడు ఇంద్రప్రస్థ నిర్మాణానికి సాంకేతిక సాయం అందిస్తే, నేటి అమరావతి నగరానికి పూర్తి సాంకేతిక మద్ధతు ఇవ్వడానికి సింగపూర్ వంటి దేశాలు ముందుకువచ్చాయి. మెరుగైన రహదారులు, జలమార్గాలు, నౌకా మార్గాలు ఏర్పాటు చేయడంవల్ల జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు నాటి ఇంద్రప్రస్థంలో మెరుగైనట్లుగానే నేటి అమరావతి నగరం మాస్టర్ ప్లాన్ కి తగ్గట్టుగా పూర్తయితే వాణిజ్యం పూర్తిస్థాయిలో విరాజిల్లుతుంది. వ్యాపార సంస్థలు పెట్టుబడులతో ముందుకువస్తాయి. విజయదశమి విజయడు (అర్జునుడు) పాశుపతాస్త్రం సంపాదించిన రోజు. పాండవమధ్యముడైన అర్జునుడు విజయం సాధించినరోజునే అమవారావతి శంకుస్థాపన చేయడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు.
కానీ కాసులేవీ….
ఇంద్రప్రస్థ నిర్మాణం సమయంలో కూడా కాసుల సమస్య వచ్చింది. అయితే నాటి పాలకుల (పాండవుల) పట్ల ప్రజల్లో సంపూర్ణ విశ్వాసం ఉంది. దీనికితోడు సామంతరాజులు ఇతోధికంగా సాయంచేశారు. పైగా శ్రీకృష్ణుడు ఉండనే ఉన్నాడు. ప్రారంభంలో కాసులకు తడబడినా పని ప్రారంభించిన తర్వాత ఇక ఆగలేదు. అదీ ముహూర్తబలం అంటే..
మరి, నేటి అమరావతి సంగతేమిటీ ? ఇంతవరకు కేంద్రం రాజధాని నిర్మాణం గురించి సీరియస్ గా పట్టించుకోలేదు. ఆమాటకొస్తే రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ కూడా ప్రకటించలేదు. శంఖుస్థాపన సభలో మోదీ ప్యాకేజీ ప్రకటిస్తారని అంతా ఆశలు పెట్టుకుంటున్నారు. ఇవ్వాళ ఉన్న పరిస్థితినిబట్టి రాజధాని (చంద్రబాబు ఊహల రాజధాని) నిర్మాణానికి కావలసిన డబ్బు ఖజానాలో లేదనే చెప్పవచ్చు. అయినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో చంద్రబాబు ముందుకుసాగడం సొంతపార్టీలోని వారినే ఆశ్చర్యపరుస్తోంది. నాడు పాండవులు ఆత్మబలంతో దిగినట్లుగానే చంద్రబాబు మనోధైర్యంతో ముందుకు పోతున్నారేమో….
మంచి లక్ష్యంతో ముందుకుసాగుతుంటే పనులు అవే చక్కబడతాయని నాటి ఇంద్రప్రస్థం చాటిచెప్పింది. మరి అమరావతి కూడా చరిత్రలో అలాంటి కథనే లిఖించబోతున్నదా…? ఏమో వేచి చూడాల్సిందే…